అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బిసి రక్షణ చట్టం
ప్రజాశక్తి - ఒంగోలు బ్యూరో : వైసిపి ప్రభుత్వ హయాంలో బిసిలందరూ భయాందోళనలతో బతుకుతున్నారని, టిడిపి అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో బిసి రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకష్ హామీనిచ్చారు. యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్రలో భాగంగా గురువారం ఒంగోలు శివారు, రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట జయహౌ బిసి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున బిసిలు తరలివచ్చారు. లోకేష్ మాట్లాడుతూ.. బిసిలకు దామాషా పద్ధతిన నిధులు కేటాయించి, కార్పొరేషన్లను బలోపేతం చేస్తామన్నారు. వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఆదరణ పథకాన్ని తిరిగి పునరుద్దరించి, బిసిలకు పనిముట్లు అందజేస్తామని, విదేశీవిద్య పథకంతో బిసి బిడ్డలకు ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుల ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సెల్‌ఫోన్‌లో ఒక్క బటన్‌తో శాశ్వత కుల ధృవీకరణ పత్రం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం కుల వృత్తులను ప్రోత్సహించి, వారి ఆర్థిక స్వావలంబనకు చేయూతనిస్తామని భరోసానిచ్చారు. బహిరంగ సభలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌రావు, అద్దంకి, కొండపి, పర్చూరు ఎమ్మెల్యేలు అద్దంకి రవికుమార్, డాక్టర్ డిబివి స్వామి, ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు.










