Aug 21,2023 22:13
  •  స్థానాలు నిలబెట్టుకున్న బుమ్రా, తిలక్‌ వర్మ
  •  ధావన్‌, చాహల్‌కు దక్కని చోటు
  •  ఆసియాకప్‌కు జట్టు ఇదే!

న్యూఢిల్లీ: ఆసియా కప్‌ 2023కు భారత సెలెక్టర్లు 17మందికి కూడిన జట్టును ప్రకటించారు. చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇతర సెలెక్షన్‌ కమిటీ సభ్యులు సోమవారం సమావేశమై ఆసియా కప్‌ కోసం టీమిండియా జట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌తోపాటు విండీస్‌ పర్యటనలో రాణించిన హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మకు బిసిసిఐ సెలెక్షన్‌ కమిటీ ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. ఆసియా కప్‌లో భారత జట్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా, హార్దిక్‌ పాండ్య వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఐపిఎల్‌లో గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్‌ రాహుల్‌ తాజాగా జట్టులోకి పునరాగమనం చేశాడు. అతడితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజూ సామ్సన్‌ బ్యాకప్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. గతేడాది ఒక్కసారి మాత్రమే ఆసియా కప్‌ను టి20 ఫార్మాట్‌లో నిర్వహించారు. ఈసారి మాత్రం యథాతథంగా వన్డేల తరహాలోనే ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఆసియా కప్‌ 2022 తర్వాత వెంటనే టి20 ఉన్న దృష్ట్యా షార్ట్‌ ఫార్మాట్‌కు ఆటగాళ్లు అలవాటు పడతారని ఆసియా కప్‌ను కూడా టి20 ఫార్మాట్‌లో నిర్వహించారు. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌ శ్రీలంక, పాకిస్థాన్‌ వేదికగా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌-నేపాల్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమై.. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 2న పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది.

పటిష్టంగా టీమిండియా..

ఆసియా కప్‌ కోసం సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలతోపాటు ఆల్‌రౌండర్లు, డేంజరస్‌ బౌలింగ్‌ ఎటాక్‌తో టీమిండియా దుర్బేధ్యంగా ఉంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా, సిరాజ్‌ టీమిండియాకు ప్రధాన బలంగా కానున్నారు. అలాగే గాయాల నుంచి తిరిగొచ్చిన ఆటగాళ్ల కూడా ఈ టోర్నీ ఎంతో కీలకంగా మారనుంది. వీరంతా ఐసిసి వన్డే ప్రపంచకప్‌ కప్‌లో చోటు దక్కించుకోవాలంటే ఆసియా కప్‌లో తప్పక రాణించాల్సిన పరిస్థితి. ఇక తెలుగు తేజం తిలక్‌ వర్మను ఎంపిక చేయడంపై క్రికెట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ధావన్‌కు దక్కని చోటు..

వన్డేల్లో పలు రికార్డులు నెలకొల్పిన టీమిండియా ఓపెనర్‌ ద్వితీయ శ్రేణి జట్టు కెప్టెన్‌గా టీమ్‌ను ముందుకు నడిపించి శిఖర్‌ ధావన్‌ చరిత్ర సృష్టించాడు. మేటి ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గాయాల బారిన పడడంతో శుభ్‌ మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి యువ బ్యాటర్లు ఓపెనర్లుగా రాణించారు. దీంతో ఓపెనర్ల కోటాకు తీవ్ర పోటీ నెలకొంది. యువ క్రికెటర్లు ఒక్కొక్కరిగా రాణిస్తుండడంతో 37ఏళ్ల ధావన్‌కు చోటు లేకుండా పోయింది. దీంతో సెలెక్టర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా శుభ్‌ మన్‌ గిల్‌ను ఎంపిక చేశారు. ఇషాన్‌ కిషన్‌కు కూడా టీమ్‌లో స్థానం కల్పించారు. ఈ క్రమంలో గబ్బర్‌కు మరోసారి నిరాశే మిగిలింది. జట్టు ప్రకటించిన అనంతరం చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. శిఖర్‌ ధావన్‌ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ లు ఎన్నో ఆడాడు. అయితే, ప్రస్తుతం.. రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌లనే ఓపెనర్లుగా మా తొలి ప్రాధాన్యమని ఆయన చెప్పాడు.
Here's the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b


టీమిండియా ఆసియా కప్‌ జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌ మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్ధిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, అక్సర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కష్ణ. ట్రావెలింగ్‌ స్టాండ్‌ బై ప్లేయర్‌ (రిజర్వ్‌ వికెట్‌ కీపర్‌)గా సంజు శాంసన్‌ ను ఎంపిక చేశారు.