Sep 15,2023 10:46

 సవాలక్ష నిబంధనలతో పథకానికి తూట్లు
 అర్హత ఉన్నా అవరోధాలు
 పేదలకు లభించని బీమా ధీమా
 అవినీతిని ఎండగట్టిన కాగ్‌


న్యూఢిల్లీ : దేశంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఆరోగ్య రక్షణ కల్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన-పిఎం జెఎవై) ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైంది. 2011 సామాజిక-ఆర్థిక కులగణన (ఎస్‌ఇసిసి) ఆధారంగా దేశ జనాభాలో 40 శాతం మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఈ పథకం అద్వితీయ విజయాన్ని సాధించిందని, అందరికీ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యానికి చేరువగా దేశాన్ని తీసుకుపోయిందని బిజెపి శ్రేణులు గొప్పలు చెప్పుకున్నాయి. వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కన్పిస్తోంది.
ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు ఉన్న వారిని ఆస్పత్రులలో చేర్చుకునేందుకు కొన్ని యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. బిల్లుల చెల్లింపులో నెలల తరబడి జాప్యం జరుగుతోందని వాటి వాదన. ఒకవేళ ఏ ఆస్పత్రి అయినా దయతలచి చేర్చుకున్నప్పటికీ బిల్లుల విషయానికి వచ్చేసరికి పేచీ పెడుతున్నాయి. ఉదాహరణకు ముంబయికి చెందిన ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. తొలుత ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆయనను చేర్చుకునేందుకు నిరాకరించినా చివరికి అంగీకరించి శస్త్రచికిత్స చేశారు. దురదృష్టవశాత్తూ ఆపరేషన్‌ విజయవంతం కాకపోవడంతో ఆయన చనిపోయారు. ఆస్పత్రి బిల్లు మూడు లక్షల రూపాయలు కట్టి తీరాల్సిందేనని యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము నుంచి దానిని మినహాయించుకోవాలని కుటుంబసభ్యులు ఎంతగా వేడుకున్నా వినలేదు. చివరికి వారు గ్రామంలోని తమ భూమిని తనఖా పెట్టి, వచ్చిన సొమ్ముతో ఆస్పత్రి బిల్లు చెల్లించారు. ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు.
ఆది నుంచీ అడ్డంకులే
ఆయుష్మాన్‌ భారత్‌ పథకం సమాజంలోని అట్టడుగు వర్గాల వారి కోసమే ఉద్దేశించినప్పటికీ దాని రూపకల్పనలో అనేక అంశాలను విస్మరించారు. ఫలితంగా అర్హత ఉన్న వారికి కూడా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవడంతోనే సమస్యలు మొదలవుతున్నాయి. ముందుగా ఆధార్‌, రేషన్‌, శ్రమకార్డు నుండి ఎన్‌టైటిల్‌ లెటర్‌ వంటి పత్రాలు అవసరమవుతాయి. ఆధార్‌, రేషన్‌ కార్డులలో ఉన్న పేరు, ఎస్‌ఇసిసి జాబితాలోని పేరు ఒకేలా ఉంటేనే రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. ప్రధాని మోడీ ఉచిత ఆరోగ్య బీమా పథకంలో చేరడానికి ఇవి తొలి అవరోధాలు. పథకంలో చేరడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవానికి అది ఉచితంగా జరగడం లేదు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు వస్తుందో లేదో తెలియకపోయినా పేరు నమోదు చేసుకోవడానికే వంద నుండి రెండు వందల రూపాయల ముడుపు సమర్పించుకోవాల్సి వస్తోంది.
లబ్దిదారుల జాబితాలో సంపన్నులు
పేదలలో పేదలైన నిరుపేదలకు ఈ పథకంలో చోటు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరోవైపు సంపన్నులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు అధికారులను ప్రసన్నం చేసుకొని లబ్దిదారులుగా చేరిపోతున్నారు. ఈ సంవత్సరం ఆగస్ట్‌ నాటికి దేశంలోని 24 కోట్ల మందిని ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో చేర్చి వారికి కార్డులు జారీ చేశారు. అంటే పథకాన్ని ప్రారంభించిన ఐదు సంవత్సరాల తర్వాత కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారిగా గుర్తించిన వారిలో 58% శాతం మందిని ఈ పథకంలో చేర్చలేదు. 2019-21 కాలానికి సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం...ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఆరోగ్య బీమా పథకాలలో లబ్ది పొందుతున్న కుటుంబాలలో (కుటుంబసభ్యులలో కనీసం ఒకరైనా లబ్దిదారుగా ఉంటే చాలు) మూడింట ఒక వంతు మాత్రమే పేద కుటుంబాలు కాగా మిగిలినవి సంపన్న కుటుంబాలే. అంటే పేదలకు అందాల్సిన ప్రయోజనాలను సంపన్నులు దొడ్డిదారిన సొంతం చేసుకుంటున్నారన్న మాట.
నిజమైన లబ్దిదారులకు మొండిచేయి చూపుతూ, ధనిక కుటుంబాల ప్రలోభాలకు లోనై వారిని పథకంలో చేరుస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుకారిపోతోంది. దీనికి అధికార యంత్రాంగమే కారణం. లబ్దిదారుల ఎంపిక సరిగా జరగకపోవడంతో పాటు ఎంపికైన వారి విషయంలో కూడా సరైన శ్రద్ధ కనబరచడం లేదు. పైగా బీమా కంపెనీలు తమ మాయాజాలంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఇటీవల కాగ్‌ ఎండగట్టింది. గత ఐదు సంవత్సరాలలో ఈ పథకానికి బడ్జెటరీ కేటాయింపులు 360% పెరిగాయి. అయినా పేదలకు అవసరమైన ఆరోగ్య రక్షణ లభించడం లేదు.