Sep 10,2023 10:15

సాధారణంగా పురుషులతో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు కన్పిస్తుంటాయి. హార్మోన్లలో మార్పులు, పీరియడ్స్‌, ప్రెగెన్సీ సమయంలో మహిళలు ఏదో ఒక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం దాదాపు 40 శాతం మంది గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఏటేటా గర్భాశయ క్యాన్సర్‌ కారణంగా లక్షలాది మంది మహిళలు మరణిస్తున్నారు. గర్భధారణ, డెలివరీ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కనీసం 810 మంది మహిళలు చనిపోవడం ఆందోళన కలిగించే విషయం. గుండె సమస్యలు, అధిక బరువు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, హైబీపీ, విటమిన్‌ డి లోపం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, ఆస్టియో పోరోసిస్‌, డయాబెటిస్‌ వంటి అనారోగ్య సమస్యలను మహిళలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు ఆయుర్వేద వైద్యంలో పరిష్కార పద్ధతులు, మందులు ఉన్నాయి. సహజ సిద్ధమైన పద్ధతుల్లోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.

Ayurveda-for-womens-health

            మహిళల్లో 48 నుంచి 55 సంవత్సరాల మధ్యలో నెలసరి ఆగిపోతుంది. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ అప్పటివరకూ కాల్షియం నిల్వలను నిర్వహిస్తుంటుంది. నెలసరి ఆగిపోయిన తర్వాత మహిళలకు కాల్షియం అవసరం కనుక, ఈ క్రమంలో ఎముకలు గుల్లబారడం, విరిగిపోతుండటం (ఆస్ట్రోపీనియా లేదా అస్టియో ఫోసిస్‌) వంటివి జరుగుతుంటాయి. తరచుగా కాళ్లూ చేతుల నొప్పులు ప్రారంభమవుతాయి. మాంసకృత్తులు (ప్రొటీన్‌), రక్తం శాతం (హిమోగ్లోబిన్‌) తగ్గుతుంటుంది. లావుగా మారటం లేదా సన్నగా మారటం జరుగుతుంది. ఇలాంటి వాటికి తరచుగా మునగాకు కూరగా వండుకుని తింటే కాల్షియం పెరుగుతుంది. నల్లేరును కూడా ఉపయోగించ వచ్చు. దగ్గు, శ్లేషము తగ్గటానికి నల్లేరును రొట్టె, తేనే, వడియాల్లో కలిపి వాడితే తగ్గుముఖం పడుతుంది. ప్రతి ఒక్కరూ ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉండాలి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్‌, బిపి, ఎక్కువగా బరువు పెరగటం వంటివి వస్తూ ఉంటాయి. వీటికి రెగ్యులర్‌గా చెకప్‌ చేయించుకోవటం మంచిది.
 

పిసిఒడి లక్షణాలు, చికిత్స : పాలిసిస్టిక్‌ అండాశయ రుగ్మత (పీసీఓడీ) వల్ల అండాశయాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. అండం విడుదల లోపించడం లేదా అరుదుగా జరగడం, పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం వంటివి తెలుస్తాయి. అండాశయం పెద్దగా ఉండటం, అండాల చుట్టూ ఫోలికల్స్‌ ఉండటం (పాలిసిస్టిక్‌ అండాశయాలు) మరో కారణంగా చెప్పవచ్చు.
పీసీఓడీ లక్షణాలు సాధారణంగా రుతుస్రావం అయ్యే మహిళల్లో స్పష్టంగా కన్పిస్తాయి. దీనిలో పీరియడ్స్‌ సరిగా రాకపోవటం, పూర్తిగా రాకపోవటం ఉంటాయి.

  • పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం లేదా పూర్తిగా రాకపోవడం
  • ముఖం, ఛాతీ, వెన్ను లేదా పిరుదులపై అధికంగా జుట్టు పెరగడం
  • తల వెంట్రుకలు సన్నబడటం లేదా కోల్పోవడం
  • చర్మం జిడ్డుగా ఉండటం, మొటిమలు
  • మెడ, చేతులు, రొమ్ములు, తొడలపై ముదురు లేదా గట్టిగా ఉండే చర్మం
  • బరువు పెరగడం
  • ఆందోళన, డిప్రెషన్‌

నెలసరి సమస్యలు ప్రారంభం కావటం ద్వారా అనేక సమస్యలు కూడా వస్తాయి. ఇలా మోనోపాజ్‌ స్థాయి వరకూ ఈ సమస్యలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి. విదేశాల్లో ఏటేటా బ్రెస్ట్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయిస్తారు. ఏమైనా ప్రమాదకర కణుతులు ఏర్పడుతున్నాయా అని పరిశీలించటానికి ఈ టెస్టు చేయిస్తారు. మనదేశంలో ఇలా పరక్షలు చేయించుకోవాలన్న అవగాహన తక్కువగా ఉంది. సొంతంగా కూడా రొమ్ము పరీక్షలు చేసుకోవొచ్చు. వారంలో ఒకసారి అద్దం ముందు నిలబడి స్తనాలను చూసుకోవాలి. లోపల గట్టిగా ఉంటే గెడ్డలు వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. సహజ పరిణామంలో మార్పు ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
           

రక్తహీనతా ప్రమాదకరమే : రక్తహీనత ఉంటే అధిక రుతు రక్తస్రావం, నెలసరి రాకపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తలనొప్పి, తల తిరగడం, జుట్టు ఊడిపోవటం, చర్మం పొడిబారడం, దడ వంటివి వస్తాయి. ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి శరీరానికి ఇనుము అవసరం. ఇది కణాలను శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేలా చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్‌ లేనప్పుడు, కణజాలం, కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి తగినంత ఆక్సిజన్‌ను అందుకోలేవు. రక్తహీనతకు సకాలంలో చికిత్స చేయకపోతే గుండె సంబంధిత వ్యాధులకు సైతం దారితీయొచ్చు.

                                                               కొన్ని సమస్యలు - చిట్కాలు

ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో కలుషిత నీరు తాగితే జలుబు, దగ్గు, నిమ్ము చేయడం, ఉబ్బసం వచ్చే అవకాశం ఉంది.

  • పావు స్పూను దాల్చిన చెక్కపొడి, స్పూను తులసి ఆకు రసం, చిటికెడు మిరియాల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు లేదా అరస్పూను కరక్కాయ, తానికాయ చూర్ణం, చిటికెడు మిరియాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం ద్వారా తగ్గుతుంది.
  • కామెర్లు, వాంతులు, విరేచనాలు, బంక విరేచనాలు, కడుపునొప్పి వంటి రోగాల నివారణకు చేదుగా ఉండే కాకర, మెంతులు, పసుపు వంటివి నిత్యం తీసుకునే ఆహారంలో తరచుగా ఉండేలా చూసుకోవాలి.
  • దోమలు కుడితే విషజ్వరాలు ప్రబలుతాయి. వేపాకులు, కర్పూరం, నేలవేములను ఎండబెట్టి ప్రతిరోజూ ధూపం వేస్తే దోమల వ్యాప్తిని అరికట్టొచ్చు.
  • ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే అవి తీవ్రమైన సమస్యలు కాకపోతేనే శొంఠి, ధనియాలు, సోంపు, జీలకర్ర నీటిలో వేసుకొని వేడి చేసి 100 మిల్లీలీటర్ల చొప్పున రోజుకు రెండు సార్లు తాగాలి. అగస్త్య హరీతకీ రసాయనం, చ్యవన ప్రాశ లేహ్యం వంటివి పాలతో తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
  • తామర, సోబి నివారణకు గానుగ ఆకులు, వేపాకు బెరడు, మార్కుండి ఆకు, కసింతాకులను మెత్తగా నూరి పసుపు కలిపి రాస్తే తగ్గుతాయి.
  • కాళ్లు పాస్తే స్వేత మల్హం, సింధూరాది లేపం రాసుకోవాలి.
  • పిసిఒడి సమస్య ఉన్నవారు శెనగలు తినాలి.
  • ప్రతిరోజూ గంటపాటూ నడవాలి
  • మహిళలు ఎండకూ, వానకూ బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గొడుగు వాడాలి
  • అందుబాటులో మంచినీటి బాటిల్‌ ఉంచుకోవాలి
  • ప్రయాణాల్లో స్నాక్స్‌, బిస్కెట్లు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి.
55

- ప్రొఫెసర్‌ డాక్టర్‌ కోలా విజయకుమారి, ఎండి,

ఆయుర్వేద ఆచరట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ప్రసూతి విభాగం అధిపతి, విజయవాడ. సెల్‌ : 94901 06269