ప్రజాశక్తి - కర్నూలు క్రైం : రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని, జరిమానాల కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. అక్టోబర్ 30 తేది నుండి నవంబర్ 05 వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను ఆదివారం విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిపై 312 కేసులు, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 1,866 కేసులు, మైనర్ల పై 3 కేసులు, ఒన్ వే లో రాంగ్ రూట్ వెళ్ళిన వారిపై 39 కేసులు, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన వారి పై 139 కేసులు, ఏలాంటి రికార్డులు పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి పై 2,062 కేసులు, అతి వేగంతో వెళ్లి న వాహనాల పై 499 కేసులు, ఓవర్ లోడ్ తో వెళ్ళిన వాహనాలపై మోటారు వాహనాల చట్టం కింద 91 కేసులు, త్రిబుల్ రైడింగ్ సంబంధించి 195 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. రాంగ్ పార్కింగ్ చేసిన ద్విచక్రవాహానాల పై 93 కేసులు, రాంగ్ పార్కింగ్ చేసిన త్రీ వీలర, ఫోర్ వీలర్ వాహానాల పై 308 కేసులు, నంబర్ ప్లేట్ లేని వాహనాల పై 142 కేసులు నమోదు చేశామని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ క్రింద 2 కేసులు, మొత్తం 5 లక్షల 58 వేల ఈ చలనాలు పెండింగ్ లో ఉన్నాయని ఈ వారంలో 11,687 ఈ చలనాలను (రూ. 29 లక్షల 49 వేలు) రికవరీ చేశామన్నారు. జిల్లా మొత్తంలో 34 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించామన్నారు. ఆటో డ్రైవర్లకు, ప్రజలకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు , ''స్టాప్ వాష్ అండ్ గో'' కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగినా , రహదారులపై ఇబ్బందికరంగా వాహనాలు నిలిపినా వెంటనే డయల్ 100 కు సమాచారం చేరవేయాలని జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.










