Oct 20,2023 10:52
  • హిందుత్వవాదుల బెదిరింపులతో పుణె ఇనిస్టిట్యూట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ : కాశ్మీరీ జర్నలిస్టు సఫీనా నబీకి పుణెలోని మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - వరల్డ్‌ పీస్‌ యూనివర్సిటీ (ఎంఐటిడబ్ల్యుపియు) జర్నలిజం విభాగంలో ప్రకటించిన అవార్డును ప్రదానం చేసేందుకు నిరాకరించడం చర్చనీయాంశమైంది. హిందుత్వ వాదుల ఒత్తిడితో ఆమెకు ఈ అవార్డును అందజేసేందుకు నిరాకరించినట్లు తెలిసింది. ఆమె భారత ప్రభుత్వ విదేశీ విధానానికి వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారని, ఆమెకు అవార్డు ప్రదానం చేయడం వివాదాలకు దారితీసే అవకాశమున్నందున అవార్డును రద్దు చేశామని గురువారం ఎంఐటిడబ్ల్యుపియు తెలిపింది. ఏడుగురితో కూడిన జ్యూరీ ఆమెను ఏకగ్రీవంగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 17న పుణె అవార్డు స్వీకరణకు వెళ్లాల్సి ఉండగా, 16 మధ్యాహ్నం అవార్డు రద్దు చేసినట్లు ఫ్యాకల్టీ సభ్యుడి నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని సఫీనా ది వైర్‌ మీడియా సంస్థకు తెలిపారు. సఫీనాకు అవార్డును రద్దు చేసినట్లు తెలుసుకున్న జ్యూరీ సభ్యులు సునంద, సందీప్‌, వేణు 'మీడియా- ప్రజాస్వామ్యం' అనే అంశంపై చర్చకు హాజరయ్యేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని వేణు మీడియాకు చెప్పారు.