Sep 17,2023 07:10

సింహగిరిని ప్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఒక ఏడాది రాజ్యంలో వర్షాలు లేక వ్యవసాయం దెబ్బతింది. రాజ్యంలో ధాన్యం కొరత ఏర్పడింది. వచ్చే ఏడాది కూడా ఇలా జరగకూడదంటే వర్షాకాలానికి ముందు పౌర్ణమి రోజున గ్రామదేవతకు బాగా కొమ్ములున్న పాతిక గొర్రెలు బలి ఇవ్వాలని ఆస్థాన పూజారి రాజుతో చెప్పాడు.
రాజ్యంలో దండోరా వేసి కొమ్ములున్న గొర్రెలు తెప్పించాడు రాజు. అయితే ఈ ఆలోచన మంచిది కాదని, జంతువులను బలి ఇస్తే వర్షాలు పడవని రాజుకు చెప్పాలని కొంతమంది పిల్లలు రాజు దగ్గరకి వెళ్లారు. పిల్లలు చెప్పిన మాటలు రాజుకు నచ్చలేదు. గొర్రెలను బలికి సిద్ధం చేయాల్సిందేనని భటులను ఆజ్ఞాపిస్తాడు.
తెల్లవారితే బలి. జంతువుల ప్రాణాలు కోల్పోతాయని పిల్లలు ఎంతో బాధపడ్డారు. పిల్లల బాధ చూసిన ఓ అవ్వ వాళ్లకో ఉపాయం చెప్పింది. 'కొమ్ములు లేని గొర్రెలు బలికి పనికిరావు. కాబట్టి మీరు ఆ గొర్రెల కొమ్ములను తీసేయాలి. అయితే అది మీకు సాధ్యంకాని పని. కాబట్టి కొమ్ముల చివరన బొగ్గుతో నల్ల రంగు పూయండి. నలుపు రంగు ఉన్న గొర్రెలను బలి ఇవ్వరు' అని చెప్పింది.
పిల్లలు అలాగే చేశారు. తెల్లారి అందరూ బలి ఇచ్చే ప్రదేశానికి వచ్చారు. గొర్రెల కాపరి గొర్రెలను తోలుకువచ్చాడు. అయితే వాటి కొమ్ములకు నల్ల రంగు పూసి ఉంది. ఎంత శుభ్రం చేసినా రంగు పోవడం లేదు. దీంతో పూజారి 'మహారాజా, నల్ల రంగు పూసిన ఈ గొర్రెలు బలికి పనికిరావు' అని చెప్పాడు.
'ఇప్పుడెలా? బలి ఇవ్వకపోతే వర్షాలు పడవు, పంటలు పండవు, రాజ్యంలో మళ్లీ కరువు వస్తుంది. ఏం చేయాలి?' అనుకుంటూ రాజు దిగాలు పడిపోయాడు.
అప్పుడు అక్కడికి అవ్వ వచ్చి 'రాజా వర్షాలకు, గొర్రెల బలికి ఏ సంబంధం లేదు. రాజ్యంలో రోడ్ల విస్తరణ పేరుతో రెండేళ్ల క్రితం దారిలో ఉన్న చెట్లు, అడవులు కొట్టివేయించారు. దాని ఫలితంగానే వర్షాలు పడడం లేదు. ఇప్పటికైనా మేల్కొని చెట్లు పెంచండి. ప్రకృతి పచ్చగా ఉంటేనే వర్షాలు సకాలంలో కురుస్తాయి' అంది. అవ్వ మాటలను అక్కడున్న వారందరినీ ఆలోచనలో పడేసాయి. మంత్రి కూడా అవ్వ చెప్పింది అక్షర సత్యమని చెప్పాడు. రాజు కూడా ఆలోచనలో పడ్డాడు. 'వర్షాలు పడడం కోసం అనవసరంగా మూగ జీవాలను బలి ఇవ్వాలనుకున్నాను. నా అజ్ఞానాన్ని పోగొట్టినందుకు అవ్వకు కృతజ్ఞతలు' అని చెప్పాడు. అప్పుడు అవ్వ పిల్లలను దగ్గరకు పిలిచి 'ఈ ఆలోచన ముందు వచ్చింది ఈ పిల్ల్లలకే మహారాజా! జంతుబలిని ఎలా ఆపాలో తెలియక పిల్లలు మదన పడుతుంటే నేనే బొగ్గు రంగు పూయమని చెప్పాను. రాత్రంతా పిల్లలు ఎంతో కష్టపడ్డారు' అని చెప్పింది.
పిల్లలు చేసిన గొప్ప పనికి రాజుగారు చాలా సంతోషపడ్డారు. ఆ పిల్లల చేతే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని సభలో చెప్పాడు. అప్పుడు సభలో చప్పట్లు మార్మోగాయి.

- యు.విజయశేఖర్‌రెడ్డి,
99597 36475