ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో సగటు రైతు అప్పు రూ.2,45,554 అని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ ఖరాడ్ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో సగటు రైతు అప్పు రూ.1,52,113 ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో సగటు రైతు అప్పు రూ.74,121 ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే సగటు రైతు అప్పు అత్యధికంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు.
డిఫెన్స్ ఇండిస్టియల్ కారిడార్ ప్రతిపాదన లేదు
ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండిస్టియల్ కారిడార్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజరు భట్ వెల్లడించారు. వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఎన్‌సిసి కేడెట్లకు సాంకేతిక శిక్షణ ఇచ్చే ఆలోచన లేదని చెప్పారు. యువతలో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వివేకం, జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి తద్వారా వారు సమాజానికి నిస్వార్థమైన సేవలు అందించడంతో పాటు, రక్షణ దళాల వైపు మొగ్గు చూపే లక్ష్యంతోనే ఎన్‌సిసి కేడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 16,368 మంది కాంట్రాక్టు కార్మికులు
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 16,368 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సెయిల్‌లో 65,898 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని అన్నారు. గత ఐదేళ్లలో ఒక స్టీల్ యూనిట్ కూడా మూసివేయలేదని, అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుడులు ఉపసంహరించుకునేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపామని వైసిపి ఎంపి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దేశంలో స్టీల్ పరిశ్రమకు ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగలేదని వైసిపి ఎంపి పెరుమాళ్ నత్వానీ అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సెయిల్‌లో 2,472 అవినీతి, అసమర్థత, ఉల్లంఘన వంటి ఫిర్యాదులు అందాయని చెప్పారు.
16.3 శాతం విద్యార్థులు డ్రాపౌట్స్
ఆంధ్రప్రదేశ్‌లో సెకండరీ లెవెల్‌లో విద్యార్థుల డ్రాపౌట్స్ 16.4 శాతం ఉందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ అన్నారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల డ్రాపౌట్స్ వివరాలు ఇచ్చారు. ఎపిలో సెకండరీ లెవెల్‌లో 2017-18లో 22.9 శాతం, 2018-19లో 16.4 శాతం, 2019-20లో 14.8 శాతం, 2020-21లో 16.7 శాతం, 2021-22లో 16.3 శాతం విద్యార్థుల డ్రాపౌట్స్ ఉందని తెలిపారు. ప్రైమరీ లెవెల్‌లో జీరో డ్రాపౌట్స్ ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో సెకండరీ లెవెల్‌లో 2017-18లో 17.1 శాతం, 2018-19లో 13.5 శాతం, 2019-20లో 12.3 శాతం, 2020-21లో 13.9 శాతం, 2021-22లో 13.7 శాతం విద్యార్థుల డ్రాపౌట్స్ ఉందని తెలిపారు. ప్రైమరీ లెవెల్‌లో 2017-18లో 3.5 శాతం, 2018-19లో 1.9 శాతం డ్రాపౌట్స్ కాగా, తరువాత మూడేళ్లు జీరో డ్రాపౌట్స్ ఉన్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో 12.6 శాతం డ్రాపౌట్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.










