
- భారీ లక్ష్య ఛేదనకు చేరువై ఓడిన న్యూజిలాండ్
-వరుసగా నాల్గో గెలుపుతో సెమీస్ రేసులోకి కంగారులు
ధర్మశాల: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో పరుగుల వరద పారింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు కలిపి ఏకంగా 771పరుగులు చేశాయి. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 5 పరుగుల తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 389 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు చివరి బంతి వరకు పోరాడింది. చివరి బంతికి 6 పరుగులు కొడితే విజయం కివీస్‌ను వరిస్తుందనుకున్న దశలో బౌల్ట్ నేరుగా ఫీల్డర్ వద్దకు బంతిని కొట్టడంతో ఓటమిపాలైంది.
టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్‌ాహెడ్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 19ఓవర్లలో 175పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీస్కోర్‌కు పునాది వేశారు. వార్నర్(81) అర్ధసెంచరీ, హెడ్(109) సెంచరీతో కదం తొక్కారు. వీరిద్దరూ ఔటయ్యాక న్యూజిలాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించారు. చివర్లో మ్యాక్స్‌వెల్(41), ఇంగ్లిస్(38), కమిన్స్(37) ధనాధన్ బ్యాటింగ్ తోడవ్వడంతో ఆస్ట్రేలియా జట్టు 49.2 ఓవర్లలో 388పరుగులకు కుప్పకూలింది. బౌల్ట్ చివరి ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీసి ఆసీస్‌ను కట్టడి చేశాడు. ఫిలిప్‌కు మూడు, సాంట్నర్‌కు రెండు, హెన్రీ, నీషమ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో భాగంగా కివీస్ ఇన్నింగ్స్‌లో హైలైట్ అంటే రచిన్ రవీంద్ర సెంచరీనే. రవీంద్ర కేవలం 89బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. అంతకుముందు, డెవాన్ కాన్వే(28), విల్ యంగ్(32) తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ (54) జోడీ భారీ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ఆసీస్‌కు దూరం చేస్తున్నట్టే కనిపించింది. చివర్లో ఆల్ రౌండర్ జిమ్మీ నీషామ్ భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. నీషామ్ 39బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. నీషామ్ క్రీజులో ఉన్నంత సేపు న్యూజిలాండ్ గెలుపుకు చేరువవుతూ వచ్చింది. చివర్లో ఆసీస్ ఫీల్డర్లు కొన్ని బౌండరీలను అద్భుతంగా ఆపి కివీస్ విజయాన్ని అడ్డుకున్నారు. రెండు బంతుల్లో 7 పరుగులు తీయాల్సిన దశలో నీషామ్ రనౌట్ కావడం కివీస్ ఓటమికి కారణమైంది. కాగా, ఈ విజయంతో ఆసీస్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రెవిస్ హెడ్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి అండ్ బి)ఫిలిప్స్ 81, హెడ్ (బి)ఫిలిప్స్ 109, మిఛెల్ మార్ష్ (బి)సాంట్నర్ 36, స్టీవ్ స్మిత్ (సి)బౌల్ట్ (బి)ఫిలిప్స్ 18, లబూషేన్ (సి)రవీంద్ర (బి)సాంట్నర్ 18, మ్యాక్స్‌వెల్ (సి)బౌల్ట్ (బి)నీషమ్ 41, ఇంగ్లిస్ (సి)ఫిలిప్స్ (బి)బౌల్ట్ 38, కమిన్స్ (ఎల్‌బి)బౌల్ట్ 37, స్టార్క్ (సి)నీషమ్ (బి)హెన్రీ 1, జంపా (బి)బౌల్ట్ 0, హేజిల్‌వుడ్ (నాటౌట్) 0, అదనం 9. (49.2ఓవర్లలో) 388పరుగులకు ఆలౌట్.
వికెట్ల పతనం: 1/175, 2/200, 3/228, 4/264, 5/274, 6/325, 7/387, 8/388, 9/388, 10/388
బౌలింగ్: హెన్రీ 6.2-0-67-1, బౌల్ట్ 10-0-77-3, ఫెర్గ్యుసన్ 3-0-38-0, సాంట్నర్ 10-0-80-2, ఫిలిప్స్ 10-0-37-3, రవీంద్ర 8-0-56-0, నీషమ్ 2-0-32-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి)స్టార్క్ (బి)హేజిల్‌వుడ్ 28, యంగ్ (సి)స్టార్క్ (బి)హేజిల్‌వుడ్ 32, రవీంద్ర (సి)లబూషేన్ (బి)కమిన్స్ 116, మిఛెల్ (సి)స్టార్క్ (బి)జంపా 54, లాథమ్ (సి)హేజిల్‌వుడ్ (బి)జంపా 21, ఫిలిప్స్ (సి)లబూషేన్ (బి)మ్యాక్స్‌వెల్ 12, నీషమ్ (రనౌట్)లబూషేన్/ఇంగ్లిస్ 58, సాంట్నర్ (సి)మ్యాక్స్‌వెల్ (బి)జంపా 17, హెన్రీ (సి)హేజిల్‌వుడ్ (బి)కమిన్స్ 9, బౌల్ట్ (నాటౌట్) 10, ఫెర్గ్యుసన్ (నాటౌట్) 0, అదనం 26. (50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 383పరుగులు.
వికెట్ల పతనం: 1/63, 2/72, 3/168, 4/222, 5/265, 6/293, 7/320, 8/346, 9/383
బౌలింగ్: స్టార్క్ 9-0-89-0, హేజిల్‌వుడ్ 9-0-70-2, కమిన్స్ 10-0-66-2, మ్యాక్స్‌వెల్ 10-0-62-1, జంపా 10-074-3, మిఛెల్ మార్ష్ 2-0-18-0