Nov 06,2023 12:44
సామర్లకోటలో టిడ్కో ప్లాట్లను పరిశీలించిన సిపిఎం బృందం

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, సామర్లకోట రూరల్ : గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది టిడ్కో ఇళ్లకు రంగులు వేయడం పై ఉన్న శ్రద్ధ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం మండిపడ్డారు. సిపిఎం ప్రజా రక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర సోమవారం సామర్లకోట చేరుకుంది. సామర్లకోట రైల్వే స్టేషన్ వద్ద పట్టణ సిపిఎం కార్యదర్శి కరణం ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రజా రక్షణ భేరి యాత్రకు ఘన స్వాగతం పలికారు.అనంతరం పిఠాపురం రోడ్డులో నూతనంగా నిర్మించి వినియోగంలోకి రాని టిట్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ఈ ఇళ్లకు టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ రంగు వేసుకోగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ రంగును మార్పు చేసింది తప్ప కాలనీల్లో అవసరమైన త్రాగునీరు, విద్యుత్తు, డ్రైన్లు వంటి సదుపాయాలపై దృష్టి పెట్టలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది టిట్కో గృహాలు వృధాగా ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇటు జగనన్న కాలనీలను పూర్తిగా అభివృద్ధి చేయకుండా, మరోవైపు టిడ్కో ఇళ్లపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సామర్లకోటలో గృహాల్లో మౌలిక వసతులు లేవని, ప్రజలకు నివాసయోగ్యంగా లేవని, ఏలేరు కాల్వకు వరద వస్తే ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకంతో నిర్మించిన ఒకటి, రెండు, గదుల ఇళ్ల నిర్మాణంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ప్రచారం చేసుకోవడం తప్ప సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మౌలిక వసతులు కల్పించలేదన్నారు. కాంట్రాక్టర్లకు లాభాల ఇళ్ళుగా మారాయి తప్ప పేదలకు ప్రయోజనం చేకూరలేదన్నారు. ఎన్నికల ముందు హడావిడిగా ప్రభుత్వం సచివాలయాల ద్వారా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామంటున్నారని, నేటికీ లక్షలాది గృహాలు ఎందుకు అప్పగించలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రచారాలు పక్కనపెట్టి తక్షణమే మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో ఇళ్లను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏవి నాగేశ్వరరావు, కే.ధనలక్ష్మి, రాష్ట్ర నాయకులు హరిబాబు, జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ నాయకులు కె.ఎస్ శ్రీనివాస్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.