Jul 31,2023 13:17

రేగిడి (విజయనగరం) : రేగిడి మండలం అంబాడ వెంకటాపురం గ్రామంలోని బిసి బాలుర వసతి గృహంలో దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం రాత్రి విద్యార్థులు ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

11


వెంకటాపురం గ్రామంలోని వసతి గృహంలో మూడవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిరోజు రాత్రి సమయాల్లో వసతి గృహంలో విద్యార్థులను ఉంచి ఉద్యోగ సిబ్బంది హాస్టళ్లకు తాళాలు వేసి వారి ఇళ్లకు వెళ్లి మళ్లీ తెల్లవారుజామున వస్తుంటారు. రాత్రిళ్లు విద్యార్థులకు ఎలాంటి సమస్యలొచ్చినా పట్టించుకునే దిక్కుండదు. ఒకవేళ ఏదైనా సమస్య కలిగితే గ్రామంలోని తమ స్నేహితులకు ఫోన్‌ చేయాలని హాస్టల్‌ ఉద్యోగులు విద్యార్థులకు చెప్పారు. హాస్టల్‌కు తాళాలు వేసి వెళుతున్నారెందుకని ? విద్యార్థులు అడిగితే వారిని దండిస్తున్నారని విద్యార్థులు వాపోయారు.

55

హాస్టల్‌లో పూర్తిస్థాయి వార్డెన్‌ లేకపోవడంతో వంగర మండలం సీతారాంపురంలో పనిచేస్తున్న వార్డెన్‌ సూర్యారావు ఎప్పుడు వస్తారో.. రారో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. దీన్ని అదునుగా చూసుకుని హాస్టల్‌ సిబ్బంది ఈ విధంగా చేయడం బాధాకరంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో జరుగుతన్న ఈ విషయం ఎవరికైనా చెబితే హాస్టల్‌ నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. ప్రతీ రోజూ రాత్రులందు భయభ్రాంతులతో జీవిస్తున్నామని చెబుతున్నారు. ఏ హాస్టల్లో లేని విధంగా ఇక్కడ హాస్టల్లో వార్డెన్‌, సిబ్బంది వింత ప్రవర్తన చేస్తున్నారని తెలిపారు. ఇలా అయితే చదువులు మధ్యలో వదిలేసి తమ ఇళ్లకు వెళ్లి పోతామని విద్యార్థులు చెప్పారు. ఈ హాస్టల్‌ కు ఉన్నత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని వివరించారు. ఉన్నత అధికారులు దృష్టి సారించి హాస్టల్‌ లో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.