ప్రజాశక్తి -మైదుకూరు(కడప) : మైదుకూరులో డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లి బిడ్డ మృతిచెందిన విషాధ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజీపేట మండలం రావులపల్లికి చెందిన ఎస్తేరు రాణి(25) మంగళవారం రాత్రి ప్రసవ నోప్పులతో బాధపడుతూ.. స్థానిక హెచ్‌సీసీ వైద్యశాలలో చికిత్స కోసం వచ్చింది. అక్కడ వైద్యులు అన్ని పరిక్షలు నిర్వహించి ప్రసవానికి ఇంకా సమయం ఉందని వైద్యశాలలో ఉండాలని సూచించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం తిరిగి పరీక్షించి సాయంత్రానికి నొప్పులు అధికమవడంతో అత్యవసరంగా ఆపరేషన్ చేశారు. అయితే అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అధిక రక్తస్రావంతో తల్లి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడంతో అంబులెన్స్‌లో కడపకు తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యంలో చనిపోయినట్లు తెలిపారు. హెచ్‌సిసి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డతో సహా తన అక్క చనిపోయిందని మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి, బిడ్డ మృతితో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై మైదుకూరు డీఎస్‌పి వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టారు.










