Mar 04,2023 11:10

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రం చేసిన అప్పులపై కేంద్రం వివరాలు సేకరిస్తోంది. రాజ్యసభలో దీనిపై ప్రశ్న రావడంతో కేంద్ర ఆర్థికశాఖ ఆ వివరాలు సేకరించే పనిలో పడింది. ఈ మేరకు రాష్ట్రానికి పలు ప్రశ్నలతో కూడిన లేఖ పంపించింది. రాష్ట్ర విభజన జరిగిన 2014 నుంచి వివరాలు చెప్పాలంటూ రాజ్యసభలో ఒక ప్రశ్న ఖరారు కావడంతో అందుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని రాజ్యసభ నుంచి కేంద్రానికి లేఖ వెళ్లడం, అవే వివరాలపై కేంద్రం నుంచి రాష్ట్ర ఆర్థికశాఖకు సర్క్యులర్‌ వచ్చింది. 2014 జూన్‌ మూడో తేదీ నుంచి గతేడాది అక్టోబరు వరకు చేసిన అప్పుల వివరాలు సమర్పించాలని కేంద్ర ఆర్థికశాఖ కోరింది. సంవత్సరాల వారీ లెక్కలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం అప్పుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల వివరాలు కూడా ఇవ్వాలని పేర్కొంది. పలు సంస్థలు, ప్రభుత్వం నేరుగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వివరాలు బ్యాంకుల వారీ సమర్పించాలని స్పష్టం చేసింది. నాబార్డు వంటి వాటి రుణాలు కూడా చెప్పాలని లేఖలో పేర్కొంది.
        2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలు తీసుకుంటున్న రుణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో జరిగే చర్చ కీలకం కానుంది. టిడిపి, వైసిపి మధ్య ఈ వివాదం చాలా కాలంగా నడుస్తూనే ఉంది. సంవత్సరం, బ్యాంకు, కార్పొరేషన్‌, ప్రభుత్వ రంగ సంస్థల వారీ వివరాలు కోరడంతో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కూడా వివరాల కోసం కుస్తీ పడుతున్నారు. ఇప్పటివరకు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న వివరాలను అధికారులు బయటపెట్టకపోవడం తెలిసిందే. కేంద్రం, కాగ్‌, రిజర్వు బ్యాంకు వంటి సంస్థలు కార్పొరేషన్‌ రుణాలపై పదేపదే రాష్ట్ర ఆర్థికశాఖకు లేఖలు రాస్తున్నాయి. ఈ తరుణంలో రాజ్యసభలో రానున్న ప్రశ్నకోసం కేంద్రానికి రాష్ట్ర అధికారులు ఎలాంటి వివరాలు అందిస్తారన్నది వేచి చూడాలి.