ప్రజాశక్తి-కర్నూల్ స్పోర్ట్స్ : ఏషియన్ గేమ్స్‌సెపక్ తక్రా పోటీలకు కర్నూలు జిల్లాకు చెందిన శివకుమార్ భారత జట్టుకు ఎంపికైయారని సెపక్ తక్రా రాష్ట్ర కార్యదర్శి గువ్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ జట్టు ఈనెల 23వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు చైనా దేశంలోని హంగ్ జో నగరంలో జరిగే 19వ ఏషియన్ గేమ్స్ సెపక్ తక్రా ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. భారత జట్టులో మన కర్నూలు జిల్లాకు చెందిన శివకుమార్ స్థానాన్ని సంపాదించుకోవడం మన రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఈ జట్టుకు 40 రోజులపాటు థాయిలాండ్‌లో విదేశీ శిక్షకులచే శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం మరో 30 రోజుల పాటు ఢిల్లీలో అఖిల భారత సెపక్ తక్రా సంఘం శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. శివకుమార్ ఎంపిక పట్ల రాష్ట్ర సెపక్ తక్రా సంఘం ప్రతినిధులు, జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులు క్రీడాకారులతో పాటు క్రీడా అభిమానులు శివకుమార్‌కు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.










