Sep 06,2023 09:00
  • ప్రారంభమైన సమావేశాలు

జకార్తా : ఆగేయాసియా దేశాల సమాఖ్య 43వ సమావేశం, సంబంధిత సదస్సులు మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఆర్థికాభివృద్ధికి కీలక కేంద్రంగా ఆసియాన్‌ ప్రాంతాన్ని తీర్చిదిద్దడంపై దృష్టి కేంద్రీకరించాలనే లక్ష్యంతో ఈ సమావేశాలు మొదలయ్యాయి. ''ఆసియాన్‌ అంశాలు : అభివృద్ధి కేంద్రం'' అన్న అంశం ప్రాతిపదికగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆసియాన్‌ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న ఇండోనేషియా తరపున అధ్యక్షుడు జోకో విడొడొ ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు. సమైక్యంగా వుండాల్సిందిగా ఆసియాన్‌ దేశాలను ఆయన కోరారు. ఏ అధికారానికీ లేదా శక్తికి ప్రాక్సీగా వుండరాదన్నారు. ఈ ఆసియాన్‌ అనే నౌకను శతృత్వానికి వేదికగా మార్చవద్దు, దానివల్ల పరస్పరం నష్టపోవడం తప్ప మరేమీ వుండదని అన్నారు. సహకారాన్ని పెంపొందించుకునేందుకు, సంపదను సృష్టించేందుకు, ఈ ప్రాంతంలోనే కాకుండా మొత్తంగా ప్రపంచవవ్యాప్తంగా శాంతి సుస్థిరతలను నెలకొల్పేందుకు పునాదిని వేయాలని విడొడొ తన ప్రసంగంలో కోరారు. రాబోయే మూడు రోజుల్లో ఆసియాన్‌ సభ్య దేశాల నేతలు ఆసియాన్‌ భవితవ్యాన్ని రూపొందించే వివిధ అంశాలపై చర్చిస్తారని భావిస్తున్నారు. సంక్షోభాలు, అత్యవసర సమయాల్లో నిర్ణయాక క్రమం వేగిరపరిచేందుకు చర్యలు తీసుకోవడం, ఈ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే రీతిలో ఆసియాన్‌ సామర్ధ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం వంటివి చర్చనీయాంశాల్లో వున్నాయి. గత దశాబ్ద కాలంలో ఆసియాన్‌ సగటు వార్షిక అభివృద్ధి 3.98శాతానికి చేరుకుందని ఆసియాన్‌ డేటా తెలుపుతోంది.