న్యూఢిల్లీ : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఆర్థిక బిల్లు-2023ని 64 అధికారిక సవరణలతో లోక్‌సభ శుక్రవారం ఆమోదించింది. డెబిట్ మ్యూచువల్ ఫండ్స్‌లోని కొన్ని రకాలపై దీర్ఘకాలిక పన్ను ప్రయోజనాలను ఉపసంహరించుకోవాలని, జిఎస్‌టి కోసం అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలనే సవరణలు వాటిలో ఉన్నాయి. అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటి (జెపిసి) విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపిల నినాదాల మధ్య వాయిస్ ఓటింగ్ ద్వారా ఆర్థిక బిల్లుని ఆమోదించింది.
ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి పన్ను ప్రతిపాదనలను అమలు చేసే ఆర్థిక బిల్లు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించబడింది. బిల్లును ఆమోదం, పరిశీలన కోసం తరలిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సమస్యలను పరిశీలించడానికి ఆర్థిక కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీకి ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారని అన్నారు. పన్ను నుండి తప్పించుకుని విదేశీ పర్యటనల కోసం క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తుందని కూడా ఆమె చెప్పారు. బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 64 అధికారిక సవరణలను ప్రవేశపెట్టారు.
గురువారం కూడా ఎటువంటి చర్చ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదించిన సంగతి తెలిసిందే. సవరణల తరువాత, బిల్లుకు 20 కొత్త సెక్షన్లు జోడించబడ్డాయి. ఆర్థిక బిల్లు ఇప్పుడు రాజ్యసభకు పంపబడుతుంది. బిల్లును సభ ప్రారంభిస్తున్నప్పుడు, అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ నివేదికను అనుసరించి అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై జెపిసి ద్వారా విచారణ జరిపించాలన్నడిమాండ్ తో పలువురు ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకున్నారు. నినాదాలు కొనసాగడంతో సభా కార్యక్రమాలను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.