జెరూసలెం : 'ఈ యుద్ధంలో మీరు గెలవాలని మేం కోరుకుంటున్నాం' అంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యా హుతో చెప్పడంపై సర్వత్రా విమర్శలు, ఖండనలు వెల్లువెత్తాయి. సునాక్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, 'ఈ ఊచకోత, మారణకాండ కొనసాగించేందుకు ఇజ్రాయిల్‌కు ఆమోదం తెలిపినట్లు వుంది.' అని పాలస్తీనా సాలిడారిటీ క్యాంపెయిన్ (పిఎస్‌సి) విమర్శించింది. ప్రతి రోజూ ఇజ్రాయిల్ బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని, ఆహారం, నీరు, విద్యుత్, ఇంధనం లేకుండా గాజా ప్రజలు రోజుల తరబడి గడుపుతున్నారని ఆ గ్రూపు హెచ్చరించింది. కనీస సరఫరాలు లేక ఆస్పత్రులు దాదాపు కుప్పకూలే దశకు చేరుకున్నాయన్నారు. పిఎస్‌సి డైరెక్టర్ బెన్ జమాల్ మాట్లాడుతూ, సైనిక ఆక్రమణలో దశాబ్దాల తరబడి పాలస్తీనియన్లను అణచివేస్తున్న, వర్ణ వివక్ష వ్యవస్థను అమలు చేస్తున్న ఇజ్రాయిల్‌కు సంఘీభావం తెలియచేయడం కోసమే రిషి సునాక్ పర్యటన ఉద్దేశించినట్లైతే ఆయన దాన్ని రద్దు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. సునాక్ మాట్లాడిన తీరు చూస్తుంటే అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా విడిచిపెట్టి, యుద్ధ నేరాలకు పాల్పడడాన్ని సమర్ధిస్తున్నారని అన్నారు. కాల్పుల విరమణ జరిపేలా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తేవడం, గాజా దిగ్బంధనానికి అంతం పలకడం, గాజా ప్రజలకు మానవతా సాయం అందేలా చూడడం ఆయన ఈ పర్యటనలో సాధించదగ్గ ఏకైక విషయమని అన్నారు. కానీ, ఆయన అలా చేయలేదని, అది సిగ్గుచేటైన విషయమని జమాల్ విమర్శించారు.