గాజా : గాజాలో తొమ్మిదివేల మందికిపైగా క్యాన్సర్ రోగులు వైద్యం అందక బాధపడుతున్నారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగులకు అవసరమైన మందుల కొరత వేధిస్తోందని.. వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. గాజా క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ జనరల్ సుభి షైక్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'గాజాలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. అయితే రోగ నిర్థారణ, చికిత్స సామర్థ్యాల కొరతతో క్యాన్సర్ రోగులు ఎంతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. గాజాలోని లక్షమందిలో 91.3 శాతం మంది క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇది 2040 సంవత్సరానికి క్యాన్సర్‌తో బాఢపడేవారి శాతం రెట్టింపు అవుతుందని డబ్ల్యుహెచ్‌ఓ అంచనా వేసింది. ప్రస్తుతం గాజాలో క్యాన్సర్ మరణాల రేటు 12.5 శాతంగా ఉంది' అని ఆయన అన్నారు. అంతేకాకుండా గాజాలోని క్యాన్సర్ రోగులకు రేడియోథెరపి, న్యూక్లియర్ మెడిసిన్ అందుబాటులో లేవని అనేక నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లోని క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడేందుకు అంతర్జాతయ సమాజం, సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని షైక్ పిలుపునిచ్చారు.