Jul 15,2023 20:13
  • పాలస్తీనా మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి దూత వ్యాఖ్యలు

నీవా : ఇజ్రాయిల్‌, వెస్ట్‌ బ్యాంక్‌ను పాలస్తీనియన్లకు బహిరంగ జైలుగా మార్చిందని పాలస్తీనా మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూత ఫ్రాన్సెకా అల్బనీస్‌ వ్యాఖ్యానించారు. పాలస్తీనా భూభాగాల్లో గత 56ఏళ్ళుగా ఇజ్రాయిల్‌ అక్రమణ కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యుఎన్‌హెచ్‌ఆర్‌సి)లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1967 నుండి ఆక్రమణ ప్రాంతాల్లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆమె తన నివేదికను సమర్పించారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో స్వేచ్ఛ పూర్తిగా హరించబడిందని, విస్తృత రీతిలో, వ్యవస్థాగతమైన వివక్ష కొనసాగుతోందంటూ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమంది పాలస్తీనియన్లు ప్రభావతమవుతున్నారని పేర్కొంది. జెనీవాలో పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడారు. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, జన జీవనంలో చేపట్టే సాధారణ చర్యలను నేరపూరితంగా చూడడం వల్లే అధిక సంఖ్యలో పాలస్తీనియన్లపై నేరారోపణలు జరుగుతున్నాయని అన్నారు. ఒక రకంగా పాలస్తీనియన్లను బహిరంగ జైల్లో పెట్టిందని, అంతకంటే మరే రకంగానూ ఈ వ్యవస్థను నిర్వచించలేమని అన్నారు. గత 16ఏళ్ళుగా గాజాలో సాగుతున్న దిగ్బంధనం వల్ల ఆ ప్రాంతమంతా ఓపెన్‌ ఎయిర్‌ జైలుగా మారింది.