Jun 23,2023 10:40

జెరూసలేం : ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని పాలస్తీనా పట్టణంలోకి గురువారం వందలాదిమంది ఇజ్రాయిలీ సెటిలర్లు చొరబడి డజన్ల సంఖ్యలో ఇళ్ళను, కార్లను తగలబెట్టారు. పాలస్తీనా రెసిస్టెన్స్‌ ఫైటర్లు బుధవారం నలుగురు ఇజ్రాయెలీలను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు కనిపిస్తోంది. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌ వ్యాప్తంగా అదనపు బలగాలను ఇజ్రాయిల్‌ మిలటరీ మోహరించిన నేపథ్యంలో సెటిలర్ల దాడి జరిగింది. పైగా పాలస్తీనా ఫైటర్ల కాల్పులకు ప్రతిస్పందనగా వెయ్యి కొత్త ఇళ్ళను నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు ప్రకటించారు. వెస్ట్‌బ్యాంక్‌లో రోజుల తరబడి పోరాటం సాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు, ప్రకటనలతో మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 400 మంది సెటిలర్లు పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రదర్శన చేశారని, కార్లు, ఇళ్ళు, చెట్లకు నిప్పంటించారని టర్మస్‌ ఆయే పట్టణ వాసులు తెలిపారు. మొత్తంగా 30 ఇళ్లు, 60 కార్లు పూర్తిగా లేదా పాక్షికంగా తగలబడ్డాయని మేయర్‌ లాఫి అదీబ్‌ చెప్పారు. ఈ ఘర్షణల్లో 8 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. ప్రతిఘటనలకు పట్టుకొమ్మగా వుండే జెనిన్‌ నగరంలో ఇజ్రాయెల్‌ బలగాలపై జరిగిన పోరులో ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారు. ఆ మరుసటి రోజు ఎలి సెటిల్‌మెంట్‌లో కాల్పులు జరిగాయి. తాజాగా ఎలీలో వెయ్యి కొత్త ఇళ్ళను ప్రభు త్వం నిర్మిస్తుందని నెతన్యా హు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 130 మంది పాలస్తీనియన్లు మరణించగా, ఇజ్రాయెల్‌ వైపు 24 మంది చనిపోయారు.