వేసవి సెలవులు అయిపోయారు. ఇక బడికి పోవాలి. మరి పిల్లలను సిద్ధం చేస్తున్నారా ? ఇప్పటివరకు ఎంచక్కా వేసవి సెలవులు గడిపిన పిల్లలు ఒక్కసారిగా స్కూలుకు వెళ్లాలంటే కాస్త ఇబ్బంది. చిన్న పిల్లలైతే రేపు, ఎల్లుండి అని వాయిదా వేయటానికి ప్రయత్నిస్తారు. అందుకే ముందుగానే పిల్లలను సిద్ధం చేయండి.
సెలవుల్లో ఆలస్యంగా నిద్రలేవడం అలవాటై ఉంటుంది. ఇక దానికి స్వస్తి చెప్పండి. నిర్దిష్ట సమయానికి మేల్కొనడం, త్వరత్వరగా తమ పనులు చక్కబెట్టుకోవడం మొదలుపెట్టమని చెప్పండి. రాత్రుళ్లు త్వరగా పడుకోబెట్టండి. అప్పుడే ఉదయం వేళ ఏ పేచీ లేకుండా నిద్ర లేస్తారు. అలాగే ఈ సెలవుల్లో పిల్లలకు టీవీ, సెల్‌ఫోను బాగా అలవాటై ఉంటుంది. ఆ అలవాటు మానేలా వారి దృష్టి మరల్చండి.
కొత్త భయం పోగొట్టాలి..
స్కూలుకు వెళుతున్న పిల్లల్లో కూడా తరగతులు మారుతున్నప్పుడు కొత్త తరగతుల భయం వెంటాడుతుంది. భయం పోయేలా కొత్త స్నేహితులొస్తారని, టీచర్లు బోలెడు విషయాలు చెబుతారని చెప్పండి. కొంతమంది పిల్లలు స్కూలు కూడా మారుతూ ఉండవచ్చు. వారికి కూడా కొత్త బెరుకు లేకుండా కొత్త టీచర్లు, కొత్త స్నేహితుల గురించి ఉత్సాహం నింపే మాటలు చెప్పండి.
పుస్తకాలు, బ్యాగులు సర్దండి..
స్కూలు తెరిచిన వెంటనే పాఠాలు మొదలుపెట్టరు. కాబట్టి పాత పుస్తకాల్లోని పేజీలతో ఓ రఫ్ నోట్స్ తయారుచేయండి. స్కూలు బ్యాగుల్లో ఏదైనా రిపేరు ఉంటే మరమ్మతులు చేయడం మర్చిపోకండి. జిప్‌లు వేయించడం, చిరిగిన చోట కుట్టడమో.. కుట్టించడానికో అశ్రద్ధ చేయకండి.
ఎండల్లో జాగ్రత్త..
ఎండలు ఇంకా తగ్గలేదు. ఎండకు తోడు వడగాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో పిల్లలను స్కూలుకు పంపేటప్పుడు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లతో పాటు మజ్జిగను కూడా ఓ సీసాలో పోసి పంపండి. తలకు టోపీ పెట్టుకోమనండి. చెవులు మూసి వుంచేలా రుమాలుతో కట్టండి. స్కూలంటే భయం ఉన్న పిల్లలకు ఏదేని అనారోగ్యం చేస్తే ఆ ప్రభావం వారి మీద తీవ్రంగా ఉంటుంది. అందుకే పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి.
స్నేహితుల ఊసులు చెప్పండి..
టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోయిన పిల్లలు స్నేహితులతో తొందరగా కలవలేరు. అందుకే స్కూలుకు వెళితే బోలెడంత మంది స్నేహితులు వస్తారని, వారితో సరదాగా గడపవచ్చని, స్నేహంగా ఉండడం వల్ల ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉండవచ్చని వివరంగా చెప్పండి.
పాత మీద బెంగ పోయేలా..
కొంతమంది పిల్లలు కింది తరగతి టీచర్లతో చాలా అనుబంధాన్ని పెంచుకుంటారు. క్లాసు మారి, కొత్త టీచరు దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లలకు క్లాసు మారడం వల్ల కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చని చెప్పండి. కొత్త టీచరు కూడా బాగా చూసుకుంటారన్న భరోసా మాటలు మాట్లాడండి.
పాతవన్నీ తిరగేయండి..
కింది తరగతుల్లో నేర్చుకున్న విషయాలను ఒక్కసారి పునరావలోకనం చేయించండి. చిన్న పిల్లలైతే తెలుగు, ఇంగ్లీషు అక్షరమాల, చిన్న చిన్న పదాలు, అంకెలు వంటివి. కొంచెం పెద్ద పిల్లలైతే ఎక్కాలు, సైన్సు, సోషల్ పాఠాల్లో నేర్చుకున్న కొత్త విషయాలు వంటివి.
పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ఎక్కువ సమయం లేదు. పిల్లలను బడికి పంపడం తల్లిదండ్రులకు పరీక్ష లాంటిదే..మరి ఇక ఆలస్యం చేయకుండా పిల్లలను బడికి సిద్ధం చేయండి..










