లత.. సేల్స్ గాళ్‌గా పనిచేస్తోంది. ఉదయం వెళ్తే.. సాయంత్రం దాటాకే ఇంటికి చేరేది. తనకు తీరిక ఉండదని పిల్లలిద్దరికీ స్కూల్లోనే ట్యూషన్లు పెట్టించింది. తను ఇంటికి వెళ్లిన కాసేపటికి పిల్లలు వస్తారు. రోజూ ఇదే దినచర్య. పిల్లలు ఏం చదువుతున్నారో, స్కూల్లో ఏం చెబుతున్నారో పట్టించుకోవాలని ఉన్నా సమయం ఉండడం లేదని బాధపడుతుంది.
దేవి.. విద్యావంతురాలు. ఇంట్లో పిల్లలు తన మాట వినరని, స్కూలు ముగిసిన తరువాత ప్రత్యేకంగా ట్యూషనుకు పంపుతోంది. 'స్కూల్లో ఏం హోం వర్క్ ఇచ్చారో.. ట్యూషన్లో ఏం చదువుతున్నారో' పిల్లలని ఎప్పుడూ అడిగేది కాదు. స్కూల్లో.. ట్యూషన్లో పిల్లలు కష్టపడిపోతున్నారని, ఇంట్లో కూడా చదువంటే ఒత్తిడికి గురవుతారని భావిస్తోంది.
తల్లిదండ్రుల్లో చాలామంది పిల్లల చదువుపట్ల ఇదే ధోరణిలో ఉంటారు. అయితే పిల్లల చదువు పట్ల చిన్న తరగతుల నుండే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్కూలు టీచర్లు, ట్యూషను టీచర్లతో తరచూ మాట్లాడుతూ చదువు పట్ల పిల్లల ఆసక్తి, అనాసక్తులను గమనించాలి. ఏ రోజు పని ఆరోజే పూర్తి చేస్తున్నారో లేదో అడిగి తెలుసుకోవాలి. పిల్లలు, చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలిసినప్పుడు కూడా వారితో చాలా నెమ్మదిగా మాట్లాడాలి. బలవంతంగా చదివించినా ఏదో మొక్కుబడిగా చదువుతారే గాని, ఇష్టంగా చదవరు. ఈ ప్రవర్తన వారి భవిష్యత్తు ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏయే క్లాసు పిల్లలతో ఎలా మెలగాలో.. నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..
మీ పిల్లలు ఇప్పుడే స్కూలుకు వెళుతుంటే క్లాసు రూంలో ఏం జరిగింది? ఏం చెప్పారు? ఏయే ఆటలు ఆడుకున్నారు? స్నేహితుల వివరాలు వంటి ప్రశ్నలు వేయాలి. తీరిక లేని తల్లిదండ్రులైనా సరే, ఏదో ఒక సమయంలో పిల్లల స్కూలు సంగతులు పట్టించుకోవాలి. అది వారిపై మీరెంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమయ్యేలా చేస్తుంది. అలాగే ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలు మీతో పంచుకోవడం వల్ల చిన్నప్పటి నుండే స్కూలు వాతావరణం పట్ల, చదువు పట్ల సానుకూల దృక్పథం అలవడుతుంది. అలాగే స్కూలుకు సకాలంలో వెళ్లడాన్ని కూడా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. అది వారి క్రమశిక్షణకు మొదటి అడుగులా ఉపయోగపడుతుంది.
కొంచెం పెద్ద పిల్లలైతే ...
సాంకేతికతను ఉపయోగించుకుని ఎలా చదవాలో నేర్పండి. ఫోన్లో ఎప్పుడూ గేమ్స్ ఆడుతూ కూర్చొనే పిల్లలతో వివిధ యాప్‌ల్లో ఉండే విజ్ఞాన విషయాలపై శ్రద్ధ పెట్టేలా చేయండి. అప్పుడు పిల్లల్లో విజ్ఞాన అంశాలపై ఆసక్తి పెరిగి పై తరగతుల్లో మంచి ప్రతిభతో రాణిస్తారు.
ప్రవర్తన గురించి చెప్పండి..
పెద్దవారిని గౌరవించాలని ప్రతి తల్లిదండ్రీ చెబుతారు. కానీ పిల్లలకు అర్థం కాదు. అర్థమవ్వాలంటే తమ చుట్టూ వున్న వారితో సానుకూలంగా ప్రవర్తించాలని, అడిగిన విషయాలకు సమాధానం చెప్పాలని చెప్పండి. ఏదైనా సాయమడిగితే చేయాలని, చిన్న పిల్లలతో ప్రేమగా మాట్లాడాలని చెప్పండి. స్నేహితులతో గొడవలు పడొద్దనీ చెప్పండి.
చదువు విషయంలో టీచర్లతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. పిల్లలు ఏ సబ్జెక్టుల్లో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని ఆ విషయాలపై పట్టు సాధించేలా సిద్ధం చేయాలి. స్కూలు యాజమాన్యాన్ని కూడా సంప్రదిస్తూ ఉండాలి. క్లాసు రూంలో పిల్లల ప్రవర్తనపై ఆరా తీయాలి. సబ్జెక్టు వారీగా వారి లోటుపాట్లు తెలుసుకోవాలి. పిల్లల పట్ల తల్లిదండ్రులుగా మీరేం చేయాలో అడగండి. ఇలా చేయడం వల్ల టీచర్లు, పిల్లలు కూడా మీకు సహకరిస్తారు. స్కూల్లోనూ, ఇంట్లోనూ సానుకూల వాతావరణం ఉంటేనే పిల్లలు, విద్యావంతులుగానే కాక, ఉన్నత వ్యక్తిత్వం గలవారిగా కూడా ఎదగగలుగుతారు.










