Oct 06,2023 10:02
  • కాంపౌండ్‌ విభాగంలో రెండు స్వర్ణాలు

హాంగ్జూ: ఆసియా క్రీడల్లో 12వ రోజు భారత్‌కు మరో మూడు స్వర్ణ, ఒక్కో రజత, కాంస్య పతకాలు దక్కాయి. ఆర్చరీ కాంపౌండ్‌ పురుషుల, మహిళల విభాగాలతోపాటు, స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు లభించాయి. ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ, ప్రవీణ్‌ ఓజాస్‌ జంట ఇప్పటికే స్వర్ణ పతకం సాధించగా.. తాజాగా మహిళల, పురుషుల టీమ్‌ కాంపౌండ్‌ విభాగాల్లో భారత్‌కు మరో రెండు బంగారు పతకాలు దక్కాయి. అలాగే స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపిక పల్లికల్‌, హరీందర్‌ పాల్‌ సింగ్‌ పసిడిని ఒడిసిపట్టారు. ఆర్చరీ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో జ్యోతి సురేఖ, అదితి గోపిచంద్‌, పర్ణీత్‌ కౌర్‌తో కూడిన మహిళల జట్టు ఫైనల్లో చైనీస్‌ తైపీపై ఘన 2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఇక అభిషేక్‌ వర్మ, ప్రవీణ్‌ ఓజాస్‌, ప్రథ్మేష్‌లతో కూడిన భారత పురుషుల ఆర్చరీ జట్టు కాంపౌండ్‌ విభాగం ఫైనల్లో 235-230పాయింట్ల తేడాతో కొరియాపై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో 235-224 పాయింట్ల తేడాతో చైనీస్‌ తైపీపై నెగ్గి ఫైనల్లోకి దూసుకొచ్చింది. జ్యోతి సురేఖ వెన్నమ్‌, అదితి గోపిచంద్‌, పర్ణీత్‌ కౌర్‌తో కూడిన జట్టు ఫైనల్‌లో చైనీస్‌ తైపీపై 230-280 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

స్క్వాష్‌లో హరీందర్‌, దీపిక జోడికి పతకం

2

భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో ఇండియన్‌ జోడి పాల్‌ సంధు, దీపికా పల్లికల్‌ గోల్డ్‌ మెడల్‌ గెలుచుకున్నది. హౌరాహౌరీగా జరిగిన ఫైనల్లో మలేషియా జంట అజ్మన్‌, సైఫిక్‌ బిన్‌ కమల్‌ను ఓడించారు. బెస్ట్‌ ఆఫ్‌ త్రీ గేమ్స్‌లో.. ఇండియన్‌ జోడి సూపర్‌ గేమ్‌ను ప్రదర్శించింది. తొలి గేమ్‌లో 11-7 స్కోరుతో ప్రత్యర్థిపై దీపిక జోడి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక రెండవ గేమ్‌ మాత్రం హౌరాహౌరీగా సాగింది. ఓ దశలో ఈజీగానే వెళ్తున్నట్లు కనిపించినా.. మలేషియా జోడీ చివర్లో జోరును పెంచింది. దీంతో రెండవ గేమ్‌ రసవత్తరంగా సాగింది. 11-10 స్కోరు తేడాతో రెండవ గేమ్‌ను గెలిచిన దీపిక జంట.. ఆసియా క్రీడల్లో చరిత్ర సష్టించింది. ఇండియా ఖాతాలోకి మరో బంగార పతకం వెళ్లింది. ఈ సారి క్రీడల్లో ఇప్పటి వరకు ఇండియాకు 20 గోల్డ్‌ మెడల్స్‌ దక్కాయి.

  • వ్యక్తిగత విభాగంలో సౌరవ్‌కు రజతం..

స్క్వాష్‌ వ్యక్తిగత విభాగంలో సౌరవ్‌ గోశల్‌ రజత పతకాన్ని సాధించాడు. మలేషియాకు చెందిన ఇయాన్‌ యోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరవ్‌ పోరాడి ఓడాడు. తొలి గేమ్‌ను 11-9తో నెగ్గిన సౌరవ్‌.. రెండో గేమ్‌లో 9-11తో ఓడాడు. మూడో గేమ్‌ను 5-11తో, నాల్గో గేమ్‌ను 7-11తో ఓడాడు. దీంతో సౌరవ్‌ రజత పతకానికే పరిమితమయ్యాడు. దీంతో భారత్‌ 21బంగారు, 32 రజత, 33 కాంస్యాలతో సహా మొత్తం 86 పతకాలతో నాల్గోస్థానంలో కొనసాగుతోంది.

  • మహిళల హాకీ సెమీస్‌లో ఓటమి

మహిళల హాకీలో భారతజట్టు సెమీస్‌లో ఓటమిపాలైంది. గురువారం జరిగిన సెమీస్‌ పోటీలో భారత్‌ 0-4గోల్స్‌ తేడాతో ఆతిథ్య చైనా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆసియా క్రీడల్లో వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. 2018లో జకార్తా ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీజట్టు ఫైనల్‌కు చేరి జపాన్‌ చేతిలో ఓడి రజత పతకానికే పరిమితమైంది. 1982నుంచి భారత మహిళల జట్టు బంగారు పతాకాన్ని సాధించలేకపోయింది. దీంతో భారత జట్టు కాంస్య పతకం 7న జపాన్‌-దక్షిణ కొరియా మ్యాచ్‌ పరాజితతో తలపడనుంది. లీగ్‌లో మహిళల జట్టు తొలిమ్యాచ్‌లో సింగపూర్‌ను 13-0 గోల్స్‌తో ఓడించింది. ఆ తర్వాత మలేషియాపై 6-0తో గెలుపొందింది. దక్షిణ కొరియాతో జరిగిన మూడో మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగింది. హాంకాంగ్‌పై 13-0తో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓమిటి లేకుండా అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. సెమీఫైనల్‌లో చైనాతో మ్యాచ్‌లో మాత్రం తబడింది.

2


బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పివి సింధు క్వార్టర్‌ఫైనల్లో ఓటమిపాలవ్వగా.. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్, డబుల్స్‌లో చిరాగ్‌-సాత్విక్‌ సాయిరాజ్‌ సెమీస్‌కు చేరి పతకాలు ఖాయం చేశారు.
ఇక మహిళల హాకీ సెమీస్‌లో భారతజట్టు 0-4గోల్స్‌తో చైనా చేతిలో ఓడింది. దీంతో కాంస్య పతకానికే జపాన్‌-కొరియా మ్యాచ్‌ విజేతతో తలపడనుంది.