న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్ తీవ్ర ఆర్థిక అరోపణల నేపథ్యంలో అదాని గ్రూపు తనపై విశ్వాసం పెంచుకునే పనిలో పడింది. ఇందుకోసం తమ కొన్ని కంపెనీల్లో స్వతంత్ర అడిటింగ్ కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్టంట్‌ను నియమించుకుంది. అదాని కంపెనీలు తీవ్ర ఎకౌంటెన్సీ అక్రమాలు, కృత్రిమంగా షేర్ల ధరలను పెంచుకోవడం, డొల్ల కంపెనీలతో విదేశాల నుంచి పెట్టుబడులకు పాల్పడుతుందని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ ఓ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ దెబ్బతో అదాని కంపెనీ స్టాక్స్‌ల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. మరోవైపు అదాని కంపెనీలకు అప్పులిచ్చిన బ్యాంక్‌లు, విత్త సంస్థలు, బీమా కంపెనీలు బెంబేలెత్తుతున్నాయి. అదాని గ్రూపునపై వచ్చిన అరోపణలను తిప్పికొట్టేందుకు.. అదాని వాదనలను సమర్థించుకునేందుకు, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుకునేందుకు గ్రాంట్ థోర్టంట్ సంస్థను ఆడిటింగ్‌కు నియమించుకుని ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, స్వదేశీ నిధుల దారి మళ్లింపు, రుణాలను ఇతర అవసరాలకు వినియోగించడం వంటి ఆరోపణలపై ఆడిట్ ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. కానీ.. గ్రాంట్ థోర్టంట్ ఏమి చేస్తుందో వేచి చూడాలి. మంగళవారం సెషన్‌లోనూ అదాని కంపెనీల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అదాని ఎంటర్‌ప్రైజెస్ 1.87 శాతం, పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 2.06 శాతం, ఎసిసి 0.39 శాతం చొప్పున పెరగ్గా.. మిగితా స్టాక్స్ నష్టాలను చవి చూశాయి. అదాని టోటల్ గ్యాస్, అదాని ట్రాన్స్‌మిషన్, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని విల్మర్, అదాని పవర్, ఎన్‌డిటివి సూచీలు 5 శాతం చొప్పున పతనమయ్యాయి.










