Nov 09,2023 21:04

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో అపోలో హాస్పిటల్స్‌ ఏడాదికేడాదితో పోల్చితే 14 శాతం వృద్థితో రూ.233 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.204 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.4,251 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. క్రితం క్యూ2లో 14 శాతం పెరిగి రూ.4,846.9 కోట్లుగా చోటు చేసుకుందని ఆ సంస్థ గురువారం వెల్లడించింది. వచ్చే నాలుగో త్రైమాసికంలో తమ డిజిటల్‌ హెల్త్‌ వేదిక అపోలో హెల్త్‌కో లాభాల్లోకి రానుందని అపోలో హాస్పిటల్స్‌ అంచనా వేసింది. సెప్టెంబర్‌ 27న కోల్‌కత్తా, సోనాపూర్‌లోని రెండు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లను కొనుగోలు చేసింది. వీటి సామర్థ్యం 325 పడకలుగా ఉన్నాయి. పూణెలోని కొత్త హాస్పిటల్‌లో రూ.675 కోట్లతో 250 పడకలను పెంచనున్నట్లు పేర్కొంది. దీంతో మహారాష్ట్రలోని ముంబయి, పూణె, నాసిక్‌లోని తమ హాస్పిటల్స్‌లో 1000 పడకలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది. గురువారం బిఎస్‌ఇలో అపోలో హాస్పిటల్స్‌ షేర్‌ 3.78 శాతం పెరిగి రూ.5,304 వద్ద ముగిసింది.

ఐస్‌ మేక్‌ రిఫ్రిజిరేషన్‌కు రూ.77 కోట్ల రెవెన్యూ
కూలింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఐస్‌ మేక్‌ రిఫ్రిజిరేషన్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.77.02 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.67.31 కోట్ల రెవెన్యూ ప్రకటించింది. ఇదే సమయంలో రూ.4.63 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. క్రితం త్రైమాసికంలో రూ.4.47 కోట్లుగా నమోదయ్యింది. 2023ా24 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థం (హెచ్‌1)లో 18.23 శాతం వృద్థితో రూ.132.22 కోట్ల రెవెన్యూ ఆర్జించినట్లు ఐస్‌మేక్‌ రిఫ్రిజరేషన్‌ లిమిటెడ్‌ సిఎం చంద్రకాంత్‌ పటేల్‌ తెలిపారు.
గ్రాన్యూల్స్‌ ఇండియా లాభాల్లో తగ్గుదల
ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా 2023ా24 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో 30 శాతం తగ్గుదలతో రూ.10.21 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.14.51 కోట్ల చొప్పున లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం జూన్‌ త్రైమాసికంలో రూ.4.79 కోట్ల లాభాలు ప్రకటించింది. క్రితం క్యూ2లో కంపెనీ రెవెన్యూ 3 శాతం పెరిగి రూ.118.95 కోట్లుగా నమోదయ్యింది. తమ కంపెనీ ఐటి భద్రతను మెరుగుపర్చుతున్నామని గ్రాన్యూల్స్‌ ఇండియా సిఎండి డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి అన్నారు.