May 05,2023 08:35
  • ఈ ఏడాది జనవరిలోనే కొత్త పథకంపై జిఒ
  • కేంద్రం జాప్యంతో అమలు కాని వైనం
  • మరణించిన పశువులకు అందని పరిహారం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : వైఎస్‌ఆర్‌ పశుబీమా పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. తాను ఇవ్వాల్సిన ప్రీమియం డబ్బులు ఇవ్వకపోవంతో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది అక్టోబరు వరకు వైఎస్‌ఆర్‌ పశునష్టపరిహార పథకం తీసుకొచ్చింది. లబ్ధిదారుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేసేది కాదు. ఈ పథకానికి గత ఏడాది అక్టోబర్‌లో స్వస్తి పలికింది. కొత్తగా వైఎస్‌ఆర్‌ పశుబీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సాయంతో అమలుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తూ ఈ ఏడాది జనవరి 12న జిఒ నంబర్‌ 3ను విడుదల చేసింది. ఎస్‌సి, ఎస్‌టి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రైతుల నుంచి 20 శాతం ప్రీమియం వసూలు చేయనున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, జాతీయ పశు సంపద మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం 40 శాతం ప్రీమియం భరించనున్నట్లు ఈ జిఒలో తెలిపింది. దారిద్య్రరేఖకు ఎగువనున్న పాడి రైతులు 50 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, కేంద్రం, రాష్ట్రం చెరో 25 శాతం వాటా భరిస్తాయని పేర్కొంది. ఎద్దు చనిపోతే గతంలో పరిహారం వచ్చేది కాదు. ప్రస్తుతం ఆవు, గేదె మాదిరిగా ఎద్దుకు కూడా బీమా వర్తింపజేస్తున్నట్లు జిఒలో పేర్కొంది. కనీసం మూడు పశువులు చనిపోతేనే పరిహారం చెల్లించాలన్న గత నిబంధనను సవరించి ఒక పశువు మరణించినా పరిహారం వర్తింపజేయనున్నట్లు మార్గదర్శకాల్లో తెలిపింది. పాత పథకంలో గొర్రెలు, మేకలు, పందులు 30 వరకు చనిపోతేనే పరిహారం దక్కేది. కొత్త పథకంలో ఆ సంఖ్యను 50కు పెంచింది. కేంద్రం తన వాటాపై స్పందించకపోవడంతో పథకం అమలుకు నోచుకోవడం లేదు.
 

                                         19 నెలలుగా వైఎస్‌ఆర్‌ పశునష్టపరిహార పథకం క్లయిములు పెండింగ్‌

వైఎస్‌ఆర్‌ పశునష్టపరిహార పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 84 వేలకుపైగా క్లయిములు అపరిష్కృతంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన మేలుజాతి పశువుకు రూ.30 వేలు, సాధారణ పశువుకు రూ.15 వేలు, గొర్రె లేక మేక లేక పందికి రూ.ఆరు వేలు చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంది. సుమారు రూ.200 కోట్ల వరకు బీమా క్లయిమ్‌లు ఆగిపోయినట్లు సమాచారం. పరిహారం చెల్లింపు కోసం అప్‌లోడ్‌ చేస్తున్నా సాంకేతిక కారణాలతో బిల్లులు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి తిరస్కరణకు గురవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ సమస్య పరిష్కారంపై ఆర్థిక శాఖ దృష్టి సారించకపోవడంతో క్లయిము డబ్బులు చెల్లింపు అంశం అపరిష్కృతంగా ఉంది. బకాయి క్లయిములను వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.