- ఏడాదిలో మూడోసారి
- వచ్చే నెల నుంచి అమలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం భారాల మీద భారాలు మోపుతూ విద్యుత్ వినియోగదారుల నడ్డి విరుస్తోంది. ఇప్పటికే ఏడాది కాలంలో రెండు సార్లు ఛార్జీలు పెంచిన ప్రభుత్వం.. ముచ్చటగా మూడోసారి కూడా ఛార్జీలు పెంచుతూ షాక్ ఇచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన రూ.3082.99 కోట్ల సర్దుబాటు (ట్రూ అప్) ఛార్జీలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) తాజాగా అనుమతిచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో రూ.314.17 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.949.93 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.784.74 కోట్లు నాల్గవ త్రైమాసికంలో రూ.1,034.15 కోట్ల చొప్పున నష్టం వచ్చినట్లు పేర్కొంది. 60313.2 మిలియన్ యూనిట్లు (ఎంయు) విద్యుత్ అమ్మకాలు చేసినట్లు వెల్లడించింది. ఈ ట్రూఅప్ వసూలు చేసుకునేందుకు ఎపిఇఆర్‌సి అనుమతిచ్చింది. దీని ప్రకారం ఎపిఎస్‌పిడిసిఎల్ వినియోగదారులపై రూ.1,199.97 కోట్లు, ఎపిఇపిడిసిఎల్ వినియోగదారులపై రూ.1,165.24 కోట్లు, ఎపిసిపిడిసిఎల్ వినియోగదారులపై రూ.717.77 కోట్లు చొప్పున భారం పడనుంది. రూ.3,082.99 కోట్లను 2023-24 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు డిస్కమ్‌లకు ఇఆర్‌సి అనుమతిచ్చింది. ఇప్పటికే డిస్కమ్‌లు రూ.2,900 కోట్ల భారాన్ని వినియోగదారుల వద్ద గతేడాది ఆగస్టు నుంచి వసూలు చేస్తున్నాయి.
ఇది 36 నెలలపాటు ఎస్‌పిడిసిఎల్ యూనిట్‌కు 0.23 పైసలు చొప్పున, 0.22 పైసలు చొప్పున సిపిడిసిఎల్, 18 నెలల పాటు ఇపిడిసిఎల్ 0.07 పైసలు చొప్పున వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మోపిన రూ.3,088.99 కోట్లతో ఎస్‌పిడిసిఎల్ వినియోగదారులు వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో యూనిట్‌కు అదనంగా 0.2017 పైసలు, రెండో త్రైమాసికంలో 0.6325 పైసలు చొప్పున, మూడో త్రైమాసికంలో 0.5772 పైసలు, నాల్గవ త్రైమాసికంలో 0.6654 పైసలు చొప్పున చెల్లించాలి.
ఇపిడిసిఎల్ వినియోగదారులు మొదటి త్రైమాసికంలో 0.1975 పైసలు, రెండో త్రైమాసికంలో 0.6194 పైసలు, మూడో త్రైమాసికంలో 0.5652 పైసలు, నాల్గవ త్రైమాసికంలో 0.6455 పైసలు చొప్పున భారం పడనుంది. సిపిడిసిఎల్ వినియోగదారుల మొదటి త్రైమాసికంలో 0.2010 పైసలు, రెండో త్రైమాసికంలో 0.6304 పైసలు, మూడో త్రైమాసికంలో 0.5753 పైసలు, నాల్గవ త్రైమాసికంలో 0.6633 పైసలు చొప్పున భారం మోయాలి. ఈ లెక్కన మొదటి త్రైమాసికంలో 100 యూనిట్ల విద్యుత్ వాడే ఎస్‌పిడిసిఎల్ వినియోగదారులు కొత్త ఛార్జీల ప్రకారం అదనంగా రూ.43, ఇపిడిసిఎల్ వినియోగదారులు రూ.26, సిపిడిసిఎల్ వినియోగదారులు రూ.42 చొప్పున చెల్లించాలి. రెండో త్రైమాసికంలో ఎస్‌పిడిసిఎల్ వినియోగదారులు రూ.86, ఇపిడిసిఎల్ రూ.70, సిపిడిసిఎల్ రూ.85 చొప్పున అదనంగా చెల్లించాలి.











