- ముడి చమురు రిఫైనరీని నిర్మాణం
- రూ.5,400 కోట్లు విలువ
హైదరాబాద్ : మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) మంగోలియాలో మరో ప్రాజెక్టును దక్కించుకుంది. తాజాగా అత్యాధునిక ముడి చమురు రిఫైనరీ నిర్మాణ కాంట్రాక్టును పొందడంతో.. ఆ దేశంలో మూడో భారీ ప్రాజెక్ట్‌ను సంపాదించుకున్నట్లయ్యింది. దీని విలువ 648 మిలియన్ అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ 5400 కోట్లు విలువ చేస్తుందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందుకు సంబంధించి మంగోల్ రిఫైనరీ, మేఘా ఇంజనీరింగ్ సంస్థల మధ్య మంగోలియా రాజధాని ఉలాన్బాతర్‌లో ఒప్పందం జరిగింది. ఒప్పందంపై ఎంఇఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి సమక్షంలో మంగోల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్టాన్ట్సెట్సెగ్ దశ్ధవా, ఎంఇఐఎల్ హైడ్రోకార్బన్స్ విభాగం ప్రెసిడెంట్ పి రాజేష్ రెడ్డి సంతకాలు చేశారు. ఇప్పటికే మంగోలియాలో తోలి గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని 598 మిలియన్ అమెరికన్ డాలర్లతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 189 మిలియన్ల అమెరికన్ డాలర్లతో క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను అభివృద్థి చేస్తోంది. ఈ మూడు ప్రాజెక్టుల విలువ 1. 436 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.11,900 కోట్లు)గా ఉంది. భారత్, మంగోలియా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు మంగోలియా రిఫైనరీ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అని అల్టాన్ట్సెట్సెగ్ దశ్ధవా పేర్కొన్నారు. మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వామ్యం అయినందుకు తమకు గర్వంగా ఉందని పివి కృష్ణారెడ్డి అన్నారు. ఈ రిఫైనరీ వల్ల మంగోలియా ఆర్ధికంగా అభివృద్థి చెందటంతో పాటు, దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని పేర్కొన్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ వికల్ప్ పలివాల్, మంగోలియా ఎంపిటి ఇంక్ టు షాన్, మంగోలియాలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధి సంజీవకుమార్ తదితరులు పాల్గొన్నారు.