Oct 10,2022 21:31

న్యూఢిల్లీ : భారత సిమెంట్‌ రంగాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవడానికి బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారని స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే దేశంలోని సిమెంట్‌ కంపెనీలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల అంబుజా సిమెంట్‌, ఎసిసి లిమిటెడ్‌లను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా జయ ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు చెందిన సిమెంట్‌ కంపెనీ స్వాధీనంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం జెపీ గ్రూపునతో చర్చలు జరుపుతున్నట్లు సోమవారం పలు రిపోర్టులు వచ్చాయి. ఈ కంపెనీ స్వాధీనానికి రూ.5వేల కోట్లు చెల్లించడానికి ఆఫర్‌ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ రంగంలో ఆదిత్య బిర్లా గ్రూపు అతిపెద్ద కంపెనీగా ఉంది. అంబుజా సిమెంట్‌, ఎసిసి కంపెనీల స్వాధీనంతో అదానీ గ్రూపు రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం అదానీ గ్రూపు ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 67.5 మిలియన్‌ టన్నులుగా ఉంది. జెపి సిమెంట్‌ తన చేతికి వస్తే మరో 2 మిలియన్‌ టన్నులు పెరగనుంది. వచ్చే ఐదేళ్లలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మిలియన్‌ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే సిమెంట్‌ కంపెనీల స్వాధీనంపై దృష్టి సారించింది.