
- నక్కపల్లికి బల్క్‌డ్రగ్ పార్క్‌ను తరలిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
- కాలుష్య భయంతో స్థానికుల ఆందోళన
- 'హెటిరో' రెండో పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే
- కొనసాగుతున్న పోరాటం
ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : ప్రజా ప్రతిఘటనతో కాకినాడ్ సెజ్‌లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, దీనిని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సొంత జిల్లా అనకాపల్లిలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయాలని బుధవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో, ఈ ప్రాంత ప్రజల్లో కలవరం ప్రారంభమైంది. నక్కపల్లి హెటిరో డ్రగ్ కంపెనీ సముద్రంలోకి విడిచిపెడుతున్న వ్యర్థాలతో మత్స్య సంపద గణనీయంగా తగ్గడంతో జీవనోపాధి దెబ్బతిన్న రాజయ్యపేట, బోయపాడు, పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక, అమలాపురం, డిఎల్‌పురం, బంగారయ్యపేట గ్రామాల మత్స్యకారులు హెటిరో రెండో పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నారు. కంపెనీకి ఆనుకొని ఉన్న అయ్యన్నపాలెం, నల్లమట్టిపాలెం, బుచ్చిరాజుపేట, ఎన్.నర్సాపురం, చందనాడ, జానకయ్యపేట, సిహెచ్‌ఎల్.పురం ప్రజలు కాలుష్య ప్రభావానికి గురవుతున్నారు. మత్స్యకారుల, స్థానిక ప్రజల బాధలు ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుత కాకినాడ జిల్లా తొండంగి మండలం కెపి పురం, కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం 2020 అక్టోబర్ 15న కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. రెండు వేల ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో, తమ ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందంటూ అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ ఏడాది జూన్ ఆరున జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో మత్స్యకారులు, రైతులు, స్థానిక ప్రజలు బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకించారు. కేంద్ర, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి)కు, కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. విశాఖ-చైన్నరు ఇండిస్టియల్ కారిడార్‌లో భాగంగా నక్కపల్లి పారిశ్రామిక క్లస్టర్ కోసం 4,500 ఎకరాలను ఎపిఐఐసి ద్వారా ప్రభుత్వం సేకరించింది. కాకినాడ సెజ్‌లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో ఈ పార్కును ఈ నక్కపల్లిలోని ఈ భూముల్లో ఏర్పాటుకు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు, డిఎల్‌పురంలో రైతులకు, వృత్తిదారులకు, కార్మికులకు పూర్తి స్థాయిలో పరిహారం, ప్యాకేజీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బల్క్ డ్రగ్ పార్క్‌ను నక్కపల్లికి తరలిస్తామన్న మంత్రివర్గ నిర్ణయంతో పుండుమీద కారం జల్లినట్లయింది. తీరప్రాంతంలోని పాయకరావుపేట మండలం కేశవరం డెక్కన్ ఫైన్ కెమికల్స్, నక్కపల్లి హెటిరో డ్రగ్స్, పరవాడ, అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలు సముద్రంలోకి విడిచిపెడుతున్న వ్యర్థాలతో మత్స్య సంపద తగ్గుతోంది. వాయు, జల కాలుష్యంతో పరిసర ప్రాంత ప్రజలు అనార్యోగం పాలవుతున్నారు. కాలుష్య పరిశ్రమల ముప్పు నుంచి రక్షించాలని ఆయా ప్రాంత ప్రజల డిమాండ్‌గా ఉంది. దీనిని పట్టించుకోకుండా మరో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బల్క్ డ్రగ్ పరిశ్రమల్లో కాలుష్యం విడుదల ఎక్కువగా ఉంటుందని, పర్యావరణానికి మరింత హాని కలుగుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉపసంహరించుకోవాలి
నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. హెటిరో, డెక్కన్ కెమికల్స్ వంటి కంపెనీల కాలుష్యంతో ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింది. పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. కాలుష్య కారక పరిశ్రమలు నెలకొల్పేందుకు ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్కును తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేకపోతే ప్రజా ఉద్యమాలతోపాటు న్యాయ పోరాటాలతో అడ్డుకుంటాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటుచేసి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి.
- ఎం.అప్పలరాజు, సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు