
కష్టజీవులు పోరాడి సాధించుకున్న మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం (ఎం.జి నరేగా) పీక నులిమేందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం మరోసారి తెగబడింది. ఈ ఎనిమిదేళ్లలో నరేగాను నీరుగార్చేందుకు ఒక పథకం ప్రకారం దాడులు సాగిస్తున్నది. ఈ దాడుల పరంపరలో భాగమే ఉపాధి హామీ చట్టం కింద గ్రామ పంచాయతీల పరిధిలో ఒకేసారి 20కి మించి పనులు చేపట్టరాదంటూ రాష్ట్రాలకు జారీ చేసిన హుకుం. ప్రస్తుతం కేరళ వంటి రాష్ట్రాలు జాతీయ ఉపాధి హామీ కింద రోజుకు 25 నుంచి 30 వరకు పనులు చేపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా సర్కులర్ వల్ల అవి పనులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా ఉపాధి కూలీల పని దినాలు కుదించబడతాయి. దీని ప్రభావం గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపైన, స్థానిక సంస్థల కార్యకలాపాలపైన తీవ్రంగా ఉంటుంది. స్వాతంత్య్రానంతర భారత దేశంలో పేదలకు ఈ చట్టం ఊరట ఇచ్చినంతగా మరే చట్టమూ, పథకమూ ఇవ్వలేదనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు వామపక్షాల చొరవతో 2006 ఫిబ్రవరిలో యుపిఏ-1 ప్రభుత్వం మొట్ట మొదట దీనిని ప్రవేశపెట్టింది. 200 జిల్లాల్లో మొదట ప్రయోగాత్మకంగా అమలు చేసిన నరేగాను 2008లో దేశవ్యాపితంగా విస్తరింపజేసింది. గ్రామీణ భారతంలో ఆస్తులు సృష్టికి, పేద ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి ఉపయోగపడింది. 2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఉపాధి హామీ ఉసురు తీసేందుకు దాడులను ముమ్మరం చేసింది. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఒక్కసారిగా రద్దు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో అంచెలంచెలుగా దీనిని బలహీనపరిచే యత్నాలు చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా ఆకలి, పేదరికం, అవిద్య ఇప్పటికీ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. సక్సేనా కమిటీ నివేదిక భారత్‌లో 50 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని పేర్కొనగా, ప్రణాళికా సంఘం రద్దు కావడానికి ముందు ఇచ్చిన నివేదికలో 39 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని తెలియజేసింది. 2012లో ఆర్‌బిఐ ఇచ్చిన రిపోర్టు 21.9 శాతమే పేదరికం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని చుట్ట చుట్టేసి భారత్‌లోని పేదరికం మటుమాయమైందని ప్రపంచానికి చెప్పాలని చూస్తున్నది. నరేగాకు యుపిఏ ప్రభుత్వం మొత్తం బడ్జెట్‌లో నాలుగు శాతం దాకా కేటాయిస్తే, మోడీ ప్రభుత్వం దానిని 2 శాతానికి కుదించేసింది. లేబర్‌కోడ్‌లు తీసుకొచ్చి కార్మిక హక్కులను హరించినట్టుగానే గ్రామీణ పేదలపై అది కత్తి కట్టింది. వేతనం కుందింపు, ఒక పూట నుంచి రెండు పూటలకు పని పెంపు, పని దినాల తగ్గింపు, రాయితీల తొలగింపు వంటి ఆంక్షలను పెడుతూ ఉపాధి హామీ పనులంటేనే భయపడేలా చేస్తున్నది. ఉపాధి కూలీలను భూస్వాముల కబంధ హస్తాల్లోకి తిరిగి నెట్టాలని చూస్తున్నది. 2022-23 బడ్జెట్‌లో నరేగాకు నిధులను గతేడాదితో పోల్చితే 25 శాతం కోత పెట్టింది. కేటాయింపులు తగ్గించడం వల్ల ఉపాధి హామీ పనిదినాలపైన, వేతనాలపైన, సౌకర్యాలపైన దాని ప్రభావం పడుతున్నది. దీనికి ఒకేసారి 20కి మించి పనులు చేయరాదన్న నిబంధన ఉపాధి హామీ చట్టం స్ఫూర్తినే దెబ్బ తీస్తుంది. మోడీ ప్రభుత్వ ఈ వ్యవసాయ కార్మిక వ్యతిరేక, ఉపాధి కూలీ వ్యతిరేక, రైతు వ్యతిరేక చర్యపై కేరళ ప్రభుత్వం గట్టిగానే నిలదీసింది. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి తమ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. ఇంత జరిగినా మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నోరు విప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వచ్చే ఏడాది మార్చికల్లా 24 కోట్ల పనిదినాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ చర్యను ఇంతవరకు కనీసం ఖండించలేదు. దీనిని బట్టి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే మోడీ ప్రభుత్వ చర్యకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతిస్తున్నదని అనుకోవాలా? గ్రామీణ పేదల ప్రయోజనాలను కట్టుబడి ఉండే ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వ చర్యను కచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం మేల్కొని అన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలతో కలసి పోరాడాల్సిన అవసరముంది. అదే సమయంలో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వ మెడలు వంచేందుకు గ్రామీణ పేదలు, కూలీలు, వ్యసాయ కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం మరింతగా ఉన్నది.