Mar 14,2023 20:14

వాషింగ్టన్‌ : ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా మరో 10,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. నాలుగు నెలల క్రితం 11వేల మంది సిబ్బందికి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఈ సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 13 శాతానికి సమానం. తాజాగా రెండో రౌండ్‌లోనూ 10వేల మందిని తొలగించాలని నిర్ణయించామని.. అయితే కొత్తగా 5వేల మందిని తీసుకోనున్నామని మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) మార్క్‌ జూకర్‌బర్గ్‌ తెలిపారు. తమ ఆర్థిక పరపతిని పెంచుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీర్ఘకాల లక్ష్యంలో భాగంగా ఉద్వాసనలు జరుగుతున్నాయన్నారు. తొలగింపులు తప్పా సంస్థకు మరో మార్గం లేదన్నారు. టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ట్విట్టర్‌ సగం మంది ఉద్యోగులను తొలగించగా... తాజాగా మెటా, సేల్స్‌ఫోర్స్‌ల్లోని వేల మంది సిబ్బందికి ఆ కంపెనీలు ఉద్వాసన పలుకుతున్నాయి. 2004లో ఫేస్‌బుక్‌ ప్రారంభమైన తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. ప్రకటనల ఆదాయం తగ్గుముఖం పట్టడం, అమెరికా సహా ప్రపంచ దేశాల్లో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో మెటా కోతలకు దిగుతోంది. ఈ గ్రూపు పరిధిలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి దిగ్గజ సోషల్‌ మీడియా వేదికలు ఉన్నాయి. 2022 నుంచి టెక్‌ పరిశ్రమలో 2,80,000 ఉద్యోగాలు ఊడయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో 40 శాతం ఉద్వాసనలు ఈ ఏడాదిలోనే జరిగాయి.