మంటలు మంటలు మంటలు
ప్రపంచంలో ఏదో ఓ మూల
ఎప్పుడూ మంటలు
ఎప్పుడూ ఆర్తనాదాలు
ఎప్పుడూ ఆకలి కేకలు
పసిపిల్లల తల్లుల రోదనలు
ఆప్తులు దూరమౌతున్న నిశిరాత్రులు
దాక్కునే జాగా లేక
తమదంటూ అంగుళం భూమి లేక
తమ స్థలంలోనే కాందిశీకులై
బిక్కుబిక్కుమంటూ
క్షణాలు లెక్కపెడుతూ
బతుకీడుస్తున్న అభాగ్యులు
తమ బాధలకు కారణమైనవాడినీ
కీర్తిస్తున్న జనాల్ని చూసి
ఏ మానవత్వంకోసం
ఎదురు చూస్తారు పాపం
మండేది ఎవరైనా
మండిస్తున్నవాడు ఎప్పుడూ ఒకడే
మంటల్ని పండిస్తున్నవాడు
ఎప్పుడూ వాడే మరి
కమిలిన దేహాల వాసనలే
వాడి ముక్కుపుటాలకు సుగంధం మరి
ఎవరో ఒకరు
ఎప్పుడూ చస్తుండాలి వాడికి
ఎవరో ఒకరు
ఎప్పుడూ చంపుతుండాలి వాడికి
మనుషులేమైపోతే వాడికేం
మృగ వినోదం వాడికి ఇష్టం మరి
మనిషి మొహం పెట్టుకున్న జంతువే వాడు.
- జంధ్యాల రఘుబాబు,
సెల్ : 9849753298