ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకి నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ (ఎన్‌ఏఏసీ) ర్యాంకింగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ 3.74 సగటు గ్రేడ్ పాయింట్లతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని 98 సంవత్సరాల ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ఘనత సాధించామని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ర్యాంకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో పర్యటించిన 7గురు సభ్యుల నాక్ బృందం 3 రోజులపాటు యూనివర్సిటీని పరిశీలించిన అనంతరం సోమవారం సాయంత్రం ర్యాంక్ లను ప్రకటించడం జరిగిందని తెలిపారు. దేశంలోనే అత్యధిక సగటు గ్రేడ్ పాయింట్లను ఆంధ్రప్రదేశ్ విశ్వ విద్యాలయం సాధించిందని 4 పాయింట్లు గాను 3.74 పాయింట్లు ఆంధ్ర యూనివర్సిటీ సాధించిందని దేశవ్యాప్తంగా కేవలం మూడు యూనివర్సిటీలు మాత్రమే 3.5 పాయింట్లు అధిగమించాయని తెలిపారు. ఈ పాయింట్ల ద్వారా ఆంధ్ర విశ్వ కళాపరిషత్ వచ్చే 7 సంవత్సరాలపాటు అనగా 2030 నవంబర్ 8వ తారీకు వరకు ఏ++ గ్రేడ్ లో కొనసాగుతుందని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ కరిక్యులం, టీచింగ్ అండ్ లెర్నింగ్, పరిశోధన, స్టూడెంట్ సపోర్ట్, మౌలిక వసతులు, గవర్నెన్స్ అండ్ లీడర్షిప్, ఇన్స్టిట్యూషనల్ బెస్ట్ ప్రాక్టీసేస్ లో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకుగాను ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా ఈ ర్యాంకు ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ దేశం వెలుపల కూడా క్యాంపస్ లు స్థాపించినందుకు అర్హత సాధించిందని, మొట్టమొదటిసారిగా 6500 మంది ఆర్మీడ్ ఫోర్స్ వారికి ఆంధ్ర యూనివర్సిటీ శిక్షణ ఇవ్వడం, దేశంలోని ఏ యూనివర్సిటీకి లేని విధంగా 2 అంతర్జాతీయ చైర్ ప్రొఫెసర్లతో పాటు 16 చైర్ ప్రొఫెసర్ల ను కలిగి ఉండటం , ఇండియా ఖేలో ఇండియా 37.5 కోట్లతో ఆంధ్ర యూనివర్సిటీలో 6 వాకింగ్ ట్రాక్ లు టర్ఫ్ ఫుట్ బాల్ కోర్టు తో పాటు పలు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ముందుకు రావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీని అగ్నివీర్ ట్రైనింగ్ సెంటర్ గా గుర్తించడం వంటి అంశాలు ఉన్నాయని వివరించారు. ఇన్స్టిట్యూషనల్ బెస్ట్ ప్రాక్టీస్ కింద ఆ హబ్ ఆర్ లో ఉన్న 124 స్టార్ట్ అప్స్ కంపెనీలు , ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ యోగా, సైకాలజీ సెంటర్ లలో ఉన్న సదుపాయాలు , జాతీయ యువజన సదస్సుకు ఏయూ ఎంపిక కావడం కూడా కలిసి వచ్చింది అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య జేమ్స్ స్టీఫెన్, ఓఎస్డీ కృష్ణ మోహన్, డైెరెక్టర్ సమత పాల్గొన్నారు.