ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం):గిరిజన సహకార సంస్థ (జిసిసి) మరో మైలురాయిని అందుకుంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తున్న కాఫీ గింజలు, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. వ్యవసాయ మరియు ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ మంజూరు చేసిందని జిసిసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ తెలిపారు. జిసిసి ప్రోత్సాహంతో అల్లూరి జిల్లాలోని చింతపల్లి డివిజన్ పరిధిలో గల గొందిపాకలు, లంబసింగి, కప్పాలు క్లస్టర్లలో 1300 మంది రైతులు పెద్ద సంఖ్యలో కాఫీ, మిరియాలు సాగుచేస్తున్నారు. ఈఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో గిరిజన రైతులు పండిస్తున్న కాఫీ, మిరియాలకు మరింత అధిక ధర లభించే ఆస్కారం ఏర్పడుతుంది. కాఫీ రైతులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. తమ కృషిలో సహకరిస్తున్న గిరిజన రైతులకు, గిరిజన వికాస స్వచ్ఛంద సేవా సంస్థకు, మెసెర్స్ రిలయబుల్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆర్గనైజేషన్ (ఆర్‌సిఒ)కు, బెంగళూరు సర్టిఫికేషన్ ఏజెన్సీకి జిసిసి కృతజ్ఞతలు తెలిపింది.