May 12,2023 09:19

శాంతి థెరిసా లక్రా ... ఓ మామూలు నర్సు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని ఓ ఆదివాసి తెగ ఆరోగ్య సంరక్షణ కోసం తన జీవితాన్నే త్యాగం చేశారు. రెండు దశాబ్దాల్లో ఆమె చేసిన సేవలకు గాను భారతీయ ప్రభుత్వం 'ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు', 'పద్మశ్రీ' బిరుదులతో సత్కరించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'అస్తర్‌ గార్డియన్స్‌ గ్లోబల్‌ నర్సింగ్‌ అవార్డు-2023 ఫైనల్‌ జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవమైన ఈ రోజు ఆ అవార్డు ప్రకటన లండన్‌లో జరుగుతోంది.

ఈ రోజు ప్రకటించే అవార్డుల ఉత్సవంలో శాంతితో పాటు భారత మూలాలున్న కేరళలో జన్మించిన ఐర్లాండ్‌కు చెందిన నర్సు జిన్సీ జెర్రీ కూడా షార్ట్‌ లిస్ట్‌లో ఉన్నారు.

Andaman-Narsamma-has-an-international-reputation



     శాంతి విధులు చేపట్టిన మూడేళ్లకు ... అంటే 2004లో సునామీ దెబ్బకు అండమాన్‌ దీవులు చిగురుటాకులా వణికిపోయాయి. 'సునామీ వల్ల ఆదివాసీలు నివసించే డుంగాంగ్‌ క్రీక్‌ ప్రాంతం తుడిచి పెట్టుకుపోయింది. దీంతో మేమంతా చాలా దూరం ప్రయాణించి అడవిలోకి వెళ్లి తాత్కాలిక గుడారాలు వేసుకుని జీవించాం. చాలా రోజులపాటు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సునామీ తనతో పాటు అనేక అంటువ్యాధులను మోసుకొచ్చింది. మందులు దొరకడం చాలా కష్టమైంది. తెగవాసులకు తక్షణ ఔషధాలు పంపమని వైద్య కేంద్రాలకు సందేశాలు పంపేదాన్ని. ఆ దూతలు సుమారు 12 నుంచి 15 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లేవారు. రోజులు చాలా కష్టంగా గడుస్తున్న ఆ సందర్భంలోనే ఓ గర్భిణీ బిడ్డను కన్నది. ఆ శిశువు కేవలం 900 గ్రాముల బరువే ఉంది. వైద్య సదుపాయాలు లేని అక్కడ తల్లీబిడ్డను రక్షించడం కష్టతరమైన విషయం. కాని నేను అలా అనుకోలేదు. అత్యవసర పరిస్థితుల్లో అవలంబించే 'కంగారు తల్లి చికిత్స'ను ప్రారంభించాను. వెచ్చదనం కోసం కొన్ని కట్టెలతో మంట ఏర్పాటు చేశాను. కమ్యూనికేషన్‌ సౌకర్యాలు మెరుగుపడిన వెంటనే మేము ఉంటున్న ప్రాంతానికి చార్టెడ్‌ హెలికాప్టర్‌ను పంపమని అధికారులను అభ్యర్థించాను. తల్లీ బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని ఎంతో తపన పడ్డాను. ఆరు నెలల చికిత్స తరువాత బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగివచ్చింది. అలా సునామీ సమయంలో ఒక్క రాత్రే నాలుగు ప్రసవాలు చేశాను. ఒక్కోటి ఒక్కో అనుభవం' అంటూ అప్పటి సంఘటనను గుర్తుచేసుకుంటారు శాంతి.
 

                                                                         కన్నబిడ్డను వదిలి ..

ఇతరుల బిడ్డల కోసం ఇంతలా తపించే శాంతికి తన కన్నబిడ్డకు కడుపునిండా అన్నం పెట్టడానికి సమయం ఉండేది కాదు. దీంతో బిడ్డ పోషకాహార లోపంతో చాలా ఇబ్బంది పడేవాడు. భర్త వ్యాపారరీత్యా మరో ఐలాండ్‌లో ఉండేవారు. రోజూ అక్కడి నుంచి ప్రయాణించడం చాలా కష్టమయ్యేది. ఆమె బాధను అర్థం చేసుకున్న అత్తవారింటి కుటుంబం బిడ్డ సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి భర్త సహకారంతో తన పూర్తి కాల సమయం రోగుల సేవలోనే గడిపారు శాంతి. 'మూడేళ్ల పాటు బిడ్డను చూడకుండా కుటుంబానికి దూరంగా ఓంగీ తెగవారితోనే ఉండిపోయాను' అంటూ చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో కన్నీటి పొర కనిపిస్తోంది.
 

                                                                            దట్టమైన అడవుల్లో ...

ప్రమాదకర పరిస్థితుల్లో ఓంగీ తెగ వాసులు తమ స్థావరాలను మార్చుకుంటూ దట్టమైన అడవిలోకి వెళ్లిపోయేవారు. దీంతో వాళ్లను వెతుక్కుంటూ సముద్రతీరం వెంబడి గంటల తరబడి కాలినడకన ప్రయాణించేవారు శాంతి. 'వారికి ఆరోగ్య సంరక్షణ, పునరావాసం కల్పించడం కోసం ఒక్కోసారి నా ప్రయాణం దట్టమైన అడవిగుండా సాగేది. కొండలు, గుట్టలు ఎక్కుతూ.. వాగులు, వంకలు దాటుకుంటూ వెతికేదాన్ని. ఎటువంటి సాయం లేకుండా ఎక్కడో దూరంగా వారిని అలా వదిలి వేయడం నాకు ఇష్టం ఉండేది కాదు' అంటూ ఆమె చెబుతున్నప్పుడు బిడ్డ సంరక్షణలో ఓ అమ్మ పడే తపన కనిపిస్తుంది.
            ఐదేళ్లపాటు ఓంగీ తెగకు వైద్యసేవలు అందించిన శాంతి బ్లైర్‌ తీరప్రాంతంలో ఉన్న జిబి పాంట్‌ హాస్పటల్‌కు 2006లో బదిలీ అయ్యారు. అక్కడ కూడా ఆమె సేవలు ఆదివాసీల ఆరోగ్య సంరక్షణకే కేటాయించారు. 'నాతో పాటు నియమించిన నర్సుల బృందం 24/7 వారి సేవలోనే గడిపేవాళ్లం. ఓసారి ఓ అమ్మాయి వచ్చి నా కాళ్లకు దండం పెట్టింది. ఆ పాప సునామీ సమయంలో నేను ప్రసవం చేసిన బిడ్డ అని తెలిసి చాలా సంతోషమేసింది. కోవిడ్‌ సమయంలో కూడా వివిధ ఆదివాసీ ప్రాంతాలకు వెళ్లేవాళ్లం. వెళ్లిన వాళ్లం తిరిగి వస్తామన్న నమ్మకం కూడా ఉండేది కాదు. అంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించేవాళ్లం. మేము ఇచ్చిన మద్దతుతో చాలామంది వైద్యం చేయించుకునేందుకు ముందుకు వచ్చేవాళ్లు. ఆదివాసీలతో మాట్లాడేందుకు మా బృందం నుంచి నేనే ముందుకు వచ్చేదాన్ని. ఓంగీల నుంచి దూరంగా వచ్చేసినా ఆదివాసీలకు సేవ చేయడమంటే చాలా ఇష్టంగా ఉండేది. వారికి భాష రాదు.. వారి సంస్క ృతి మనకు అర్థం కాదు. మనలాంటి వాళ్లతో మాట్లాడేందుకే ముందుకు రారు. అటువంటి వారికి వైద్య సేవల గురించి అవగాహన కల్పించేదాన్ని. క్రమంగా ఆదివాసీ మహిళలు ఆరోగ్యకరమైన బిడ్డలను ప్రసవిస్తున్నారు. ఒకప్పుడు కేజీ బరువు కూడా లేని పిల్లలను ప్రసవించడం చూసిన నేను ఇప్పుడు రెండు నుంచి మూడు కేజీల బరువుతో పిల్లలు పుడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. వారిలో ఈ మార్పు ఒక్క రోజులో రాలేదు. ఎంతో ఓపిక, సహనంతో ఇది సాధించాం' అంటున్న శాంతి పేరు ఈ రోజు లండన్‌లో జరిగే అవార్డు కార్యక్రమంలో ప్రతిధ్వనించాలని మనసారా కోరుకుందాం.