
అనంతనాగ్‌లో ఏడు రోజుల పాటు సాగిన ఎన్‌కౌంటర్
మొత్తంగా ఆరుగురి మృతి
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ ప్రదేశంలో మంగళవారం లష్కర్ తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ సహా ఇద్దరు ఉగ్రవాదులు, ఒక జవాన్ మృతదేహాలను కనుగొన్నారు.. భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య సాగిన ఈ ఎన్‌కౌంటర్ ఏడు రోజుల పాటు జరగడం విశేషం. జిల్లాలోని కొకెర్నాగ్ ప్రాంతంలోని గడూల్ పర్వతం వద్ద బుధవారం తెల్లవారు జామున ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ మంగళవారం వరకూ జరిగింది. గత దశాబ్దకాలంలో సుదీర్ఘంగా జరిగిన ఎన్‌కౌంటర్ ఇదేనని సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ హతమార్చామని, ఎన్‌కౌంటర్ ముగిసిందని అడిషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఎడిజిపి) విజరు కుమార్ మంగళవారం ధ్రువీకరించారు. అయితే ఇప్పటికీ గాలింపు కొనసాగుతోందని, ప్రజలు అటువైపుగా వెళ్లద్దని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది ఉగ్రవాదులకు చెందిన రెండు మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు మృతదేహాల్లో ఒకటి ఉజైర్ ఖాన్‌ది అని తెలిపారు. మంగళవారం దొరికిన జవాన్ మృతదేహాన్ని పంజాబ్‌కు చెందిన సిపాయి ప్రదీప్ కుమార్ కూడా గుర్తించారు.
కొకెర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, జమ్ముకాశ్మీర్ పోలీసులు నుంచి తనిఖీలు ప్రారంభించారు. వీరిపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమయింది. బుధవారం ఉగ్రవాదుల కాల్పుల్లో కర్నల్ మన్‌ప్రీత్ సింగ్‌తోపాటు మేజర్ ఆశిష్ ధొనక్, జమ్ముకాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన డిఎస్‌పి హుమయూన్ భట్ మరణించారు.. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తంగా ఆరుగురు మరణించగా, ఇందులో నలుగురు భద్రతా సిబ్బంది, మరో ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన లష్కర్ తొయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ అనంత్‌నాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తే. అయితే ఇతను 26 జులై 2022 నుంచి ఆచూకీ లేడని తెలుస్తోంది.