తెలుగు బాల సాహిత్యం అతి పురాతనమైనది. తల్లీబిడ్డా ఎప్పటినుంచి ఉన్నారో అప్పటి నుంచీ బాలసాహిత్యం ఉంది. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే నిద్ర పుచ్చడానికి అమ్మ పాడే జోల పాట మొదలు, బడిలో అడుగుపెట్టే వరకు ఇంట్లో పెద్దలు చెప్పే కథలు, పాటలు, పద్యాలు, సామెతలు, సూక్తులు, జాతీయాలు వంటివన్నీ బాల సాహిత్యమే అనొచ్చు. సాహిత్యం అంటే సమాజ హితం కోరేది. బాలసాహిత్యం అంటే బాలల హితం కోరేది కనుక ఇదంతా బాల సాహిత్యమే! పిల్లలు బడికి వెళ్లడానికి ముందే అనగా అక్షర జ్ఞానం కలగకముందే వారి ఉన్నతికి ఉపయోగపడే అనేక అంశాలను ఎదుగుతున్న క్రమంలో నేర్చుకుంటారు. పిల్లల బాల్యాన్ని చక్కగా ప్రభావితం చెయ్యగలిగితే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందనేది సత్యం. ఇంట్లో పెద్దలు, బడిలో గురువులు నేర్పించే మంచి అంశాలతో పిల్లల్లో చక్కని నడవడిక, క్రమశిక్షణ అలవడతాయి. వీరితో సమానమైన బాధ్యతను బాల సాహితీవేత్తలు నిర్వర్తిస్తుంటారు.
నాటి కాలంలో గురజాడ, కందుకూరి, నార్ల చిరంజీవి, వేటూరి కామేశ్వరరావు, న్యాయపతి రాఘవరావు, బి.వి. నరసింహారావు మున్నగువారు పిల్లల మేలుకోరి ఎన్నో మంచి రచనలను అందించారు. తదుపరి కాలంలో కవిరావు, వేజెండ్ల సాంబశివరావు, రెడ్డి రాఘవయ్య, వెలగా వెంకటప్పయ్య, అలపర్తి వెంకట సుబ్బారావు, సమతా రావు మొదలైనవారు తమ రచనలతో పిల్లల ఉల్లములను కొల్లగొట్టారు. తరువాతి కాలంలో కూడా అనేకమంది బాలసాహితీవేత్తలు బాలల శ్రేయస్సు కోసం చక్కని రచనలను రచించి పుస్తక రూపంలో విడుదల చేసి తెలుగు లోగిళ్ళలో బాల సాహిత్య విస్తారానికి తోడ్పడ్డారు. అలాంటి బాల సాహితీవేత్తల గురించి సమాచారం సేకరించి ఒకచోట గుదిగుచ్చితే ఇతర రచయితలకు, పరిశోధక విద్యార్థులకు, బాల సాహిత్య ప్రేమికులకు మేలు కలుగుతుందని భావించి ఆ బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని విజయ తీరాలకు చేర్చిన బాల సాహితీవేత్త పైడిమర్రి రామకృష్ణ.
ఎక్కడెక్కడో ఉన్న బాలసాహిత్య రచయితల పరిచయాలను శ్రమతో సేకరించి, బాలసాహితీశిల్పులు పేరుతో చక్కని పుస్తకంగా తీసుకురావడం అభినందించదగ్గ విషయం.
పైడిమర్రి రామకృష్ణ పుట్టింది తెలంగాణ గడ్డ మీదనే అయినప్పటికీ తరతమబేధం పాటించరు. ఆంధ్రుడా, తెలంగాణేతరుడా, మరో రాష్ట్రానికి చెందిన వాడా అనేది పట్టించుకోరు. బాలసాహిత్యానికి కృషి చేస్తున్న వారందరినీ సమానంగా గౌరవిస్తారు. అందరి రచనలను ప్రోత్సహిస్తారు. అందుకే ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నెరవేర్చగలిగారు. స్వయంగా చక్కని బాలసాహితీ వేత్త అయిన పైడిమర్రి రామకృష్ణ, చక్కటి శైలిలో, సులభమైన పదాలతో అరటిపండు వలిచి పిల్లల నోటికి అందించినంత తేలికగా కథలు రాసి మెప్పిస్తారు. ఆయన రాసిన మామయ్య డాట్ కామ్, గుడ్డెలుగు బల్గం మొదలైన ఆరు కథా సంపుటాలు పాఠకుల మెప్పు పొందాయి. అలాంటి రచయిత కాబట్టే బాల సాహిత్య కారుల ప్రయోజనం ఆశించి సూర్య దినపత్రికలో 'బాల సాహితీశిల్పులు' పేరుతో రాసిన వ్యాసాలను, ఆంధ్రప్రభ బాలప్రభలో చేసిన పరిచయాలను నేడు పుస్తక రూపంలో తెచ్చారు. వందలాది కథలు రాసిన చాలామంది బాలల రచయితలు అనామకంగా ఉండిపోతున్నారు. వారి వివరాలు చదువరులకు, తోటి రచయితలకు తెలియటం లేదు. ఒకరిద్దరు మాత్రమే తమని తాము ప్రమోట్ చేసుకుంటూ ఉండగా, నిజమైన బాలసాహితీవేత్తలు మాత్రం ఎటువంటి ప్రచారం ఆశించకుండా నిశ్శబ్దంగా రాసుకుంటున్నారు. ఆ లోటును గమనించిన పైడిమర్రి బాల సాహితీవేత్తల పరిచయంతో కూడిన పుస్తకాన్ని వెలువరించారు. ఆ లోటు తీర్చడానికా అన్నట్టు ఈ పుస్తకం విడుదలై బాలసాహితీవేత్తల గౌరవాన్ని పెంచింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్.గోపి తమ ముందుమాటలో 'బంగారు మర్రి ఈ పైడిమర్రి' అని శీర్షిక పెట్టి , పైడిమర్రి రామకృష్ణ వారి ఇంటి పేరు లాగా బంగారం లాంటి విలువైన బాల రచయిత అని కూడా ప్రశంసిస్తారు. అది నిజమే అనిపిస్తుంది పైడిమర్రి గారితో పరిచయం ఉన్నవారికి.
ఈ గ్రంథంలో పాత తరం రచయితలు మొదలు ఒకటి రెండు పుస్తకాలు అచ్చువేసిన రచయితల పరిచయాల వరకు చోటు చేసుకున్నాయి. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ, ప్రముఖ రచయిత్రి తురగా జానకీరాణి గార్ల పరిచయాలతో బాటు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన బాల సాహితీవేత్తలు కలువకొలను సదానంద, భూపాల్ రెడ్డి, రెడ్డి రాఘవయ్య, డి. సుజాత దేవి, డా. దాసరి వెంకటరమణ, చొక్కాపు వెంకటరమణ, అలపర్తి వెంకట సుబ్బారావు, వాసాల నరసయ్య, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, బెలగాం భీమేశ్వరరావు, కన్నెగంటి అనసూయ, దేవరాజు మహారాజు, డా.పత్తిపాక మోహన్ గార్ల పరిచయాలు ఇందులో ఉన్నాయి. ఇంకా చందమామ రచయితలు వసుంధర, డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, మాచిరాజు కామేశ్వరరావు, బూర్లె నరసింహ శాస్త్రి, ఎం.వి.వి.సత్యనారాయణ, ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, ఎం.డి.సౌజన్య, ఎన్.వి.ఆర్.సత్యనారాయణ మూర్తి, కేకే రఘునందన, కోనే నాగ వెంకట ఆంజనేయులు వంటి రచయితల పరిచయాలూ ఉన్నాయి. సంపాదకులుగా ఉంటూ బాల సాహిత్యం రాసిన కొల్లూరు స్వరాజ్యం వెంకట రమణమ్మ, డి.వి.ఆర్. భాస్కర్, కంతేటి చంద్ర ప్రతాప్ గార్ల పరిచయాలు ఇందులో చేరాయి.
మారుతున్న కాలంతో పాటు ఫోన్, వాట్సాప్, మెయిల్ వినియోగం పెరిగింది. అతి తొందరగా సమాచారాన్ని చేరవేయడానికి రచయితల పరిచయంతో పాటు వారి ఫోటో, ఫోన్ నెంబరు, మెయిల్ ఐ.డి.ల అవసరాన్ని గుర్తించిన రామకృష్ణ వాటిని కూడా సేకరించి చిరునామా కిందనే ప్రచురించారు. ఇదెంతో ప్రయోజనకరం. 101 మంది పరిచయాలను ఒకే చోట ముద్రించి అందించిన ఈ పుస్తకం బహు విలువైనది. ఈ పుస్తకంలోని రచయితల పరిచయాల్లో భాగంగా బాల సాహిత్యంలో ప్రచురించబడిన మొదటి రచన వివరాలతో బాటు, ప్రచురించిన పుస్తకాలు, పొందిన పురస్కారాలు, జన్మదినం, కుటుంబ సభ్యుల వివరాలు మొదలైన ముఖ్య సమాచారం అందించారు. ఈ పుస్తకానికి ప్రముఖ చిత్రకారుడు తుంబలి శివాజీ చక్కని ముఖచిత్రాన్ని అందించారు. ఇంత విలువైన సమాచారం కలిగిన పుస్తకాన్ని వెలువరించిన రామకృష్ణ గారికి అభినందనీయులు. ఈ పుస్తకాన్ని రచయితలు, బాలసాహితీవేత్తలు మాత్రమే కాకుండా బాల సాహిత్యమంటే అభిమానమున్న ప్రతి ఒక్కరూ కొనుక్కుని పదిలపరచుకోవాల్సిన అవసరముంది. తాము చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు పత్రికల్లో చదివిన కథా రచయితల గురించి తెలుసుకుని ఆనందించవచ్చు. గ్రంథాలయాలలో భద్రపరచాల్సిన విలువైన పుస్తకమిది.
పుస్తకం వెల రు.200. పేజీలు :112. కాపీలు కావాల్సిన వారు సంప్రదించాల్సిన చిరునామా : పైడిమర్రి రామకృష్ణ, ఇంటి నెంబరు 9-86/1, శ్రీ కృష్ణ టెంపుల్ పక్కన, నాదర్గుల్ - 501510, బాలాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, తెలంగాణ. మొబైల్ : 92475 64699.
- నారంశెట్టి ఉమామహేశ్వర రావు,
94907 99203










