- క్రిమిసంహారకాలు చల్లినా నియంత్రణలోకి రాని వైనం
- పొలాలు, కళ్లాల్లో పుట్టలు, పుట్టలుగా చీమలు
- రెండు రోజులు హడావిడి
- జాడలేని అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్
గ్రామంలో చీమల నివారణకు ఇళ్ల గోడలకు ఇన్‌డోర్ రెసిడ్యువల్ స్ప్రే (ఐఆర్‌ఎస్) చల్లించామని, అవి ఆరు నెలల పాటు చీమలను రానీయకుండా చేస్తాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు. కానీ పొలాలు, కళ్లాలు, పరిసరాల్లో చీమలు మాత్రం పుట్టలుగా దర్శనమిస్తున్నాయి. వర్షం తగ్గిన తర్వాత కొద్దిసేపటివరకు చీమలు లేకున్నా, రోడ్లు పొడిబారిన తర్వాత మళ్లీ కనిపిస్తున్నాయి. శరీరంపై పాకి స్కిన్ ఎలర్జీకి గురిచేస్తున్నాయి. గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరం నిర్వహిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. వైద్య సిబ్బంది ఇచ్చిన మందులు వాడుతున్నా తగ్గకపోవడంతో వైద్యులే ప్రయివేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం పంచాయతీ ఇసకలపేట గ్రామాన్ని చీమలదండు వీడడం లేదు. క్రిమిసంహారక మందులు చల్లిన ప్రాంతాల్లో మూడు,నాలుగు రోజుల పాటు చీమలు కనిపించకపోయినా... మళ్లీ పుట్టలు, పుట్టలుగా దర్శనమిస్తున్నాయి. రెండు రోజుల పాటు అధికారులు హడావుడి చేశారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. పైగా ఊర్లో చెట్లు ఎక్కువగా ఉండటం వల్లే చీమలు అధికంగా ఉన్నాయని వింత సమాధానం చెబుతున్నారు.చీమల దండుతో స్థానికులు పడుతున్న ఇబ్బందులపై ప్రజాశక్తి ప్రధాన సంచికలో ఈనెల 15న 'చీమల దండయాత్ర' శీర్షికతో కథనం వచ్చిన తర్వాత అధికారులు ఆ గ్రామంలో పర్యటించారు. రెండు రోజుల పాటు క్రిమిసంహారక మందులు స్ప్రే చేశారు. ఆ తర్వాత వాటిని ఆపేశారు. ఇళ్లల్లో చీమల తీవ్రత కొంతమేర తగ్గినా పొలాలు, కళ్లాలు, గ్రామ పరిసరాల్లో పుట్టలు పుట్టలుగా చీమలు దర్శనమిస్తున్నాయి. సమీప గ్రామాలైన నారిపేట, కొత్తవలస గ్రామాలతో పాటు స్వల్పంగా దిబ్బలపేట గ్రామలనూ చీమలు చుట్టుముట్టాయి.
తేలిగ్గా తీసుకుంటున్న అధికారులు
చీమలదండుతో గ్రామస్తులు ప్రత్యక్ష నరకం చూస్తున్నా అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారు. చెట్లు విపరీతంగా ఉండడం వల్లే చీమలు వస్తున్నాయని, వాటిని తొలగిస్తే చీమలు ఉండవంటూ వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఇళ్ల గోడలపై స్ప్రే చేయించామని, గోడలపై మరకలు ఉన్నాయని నీళ్లతో కడిగేయడం వల్లే చీమలు మళ్లీ చేరుతున్నాయంటూ తప్పును గ్రామస్తుల పైకి నెట్టేస్తున్నారు. గ్రామంలో కొత్తగా కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ, పంచాయతీ అధికారులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారు తమ పేర్లను వైద్య శిబిరంలో నమోదు చేయించుకోవడం లేదన్న విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారని గ్రామస్తులు చెప్తున్నారు.










