May 14,2023 10:16
  • తేలని కార్మికుల బకాయిల పరిస్థితి
  • ఆగమేఘాలపై సాగుతున్న పనులు
  • నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : సహకార విజయ డెయిరీ కాస్తా అమూల్‌గా మారిపోనుంది.. రాష్ట్ర క్యాబినేట్‌ విజయ సహకార పాల డెయిరీ ఆస్తులు అమూల్‌కు కట్టబెడుతూ జీవోను పాస్‌ చేసింది. 99 సంవత్సరాలకు లీజుకు ఇవ్వనున్నట్లు కోఆపరేటివ్‌ అధికారులు చెబుతున్నారు.. దీంతో ఆగ మేఘాలపై అమూల్‌కు అప్పగించేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో అత్యంత విలువైన చిత్తూరు - వేలూరు జాతీయ రహదారి జిల్లా కటెక్టరేట్‌కు సమీపంలోని 28 ఎకరాల భూమిని అమూల్‌కు కట్టబెటేందుకు జేసీబిలతో శుభ్రం చేస్తున్నారు. రోజుకో ప్రజాప్రతినిధులు, అధికారులు పనులు నిత్యం పరిశీలిస్తూనే ఉన్నారు. ఇదంతా చూస్తున్నా బయటి వ్యక్తులు ఎంతోకాలం తరువాత ప్రజాప్రతినిధులు, అధికారుల అత్యుత్యాహం ఏమిటని ముక్కున వేలేసుకుంటున్నారు.
           1945లో చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిలో 28 ఎకరాల్లో పాడి రైతుల సహకారంతో 3వేల లీటర్ల పాలసేకరణతో చిత్తూరు విజయ సహకార డెయిరీ ప్రారంభమైంది. అచలంచెలుగా ఎదుగుతూ జిల్లాలోని పాడి రైతులకు అండగా నిలిస్తూ 1980 -90 మధ్య 3 లక్షల లీటర్ల పాలు సేకరించి దేశంలో అతిపెద్ద రెండో సహకార డెయిరీగా అభివృద్ధి చెందింది. విజయ డెయిరీ పేరు దేశంలో మారుమోగింది. పాల ఉత్పత్తులు తయారుచేసి దేశవిదేశాలకు ఎగుమతి చేసింది. నెయ్యి అమ్మకం ద్వారా టిటిడి నుంచి కోటి రూపాయలకుపైగా అమ్మకం జరిగేది. కోట్లాది రూపాయల టర్నోవర్‌తో లాభాల భాటలో పయనిస్తున్న విజయ సహకార డెయిరీకి జిల్లాలోని పాడిరైతలు 90శాతం పాలు పోసేవారు. నాడు 350 నుంచి 400మంది డెయిరీలో వివిధ కేటగిరిల్లో పని చేసేవారు. డెయిరీ పాలకవర్గం అవకతవకలకు నాటి ప్రభుత్వ నిరాధరణతో 2002 ఆగస్టులో సహకార విజయ డెయిరీ మూతపడింది.
          డెయిరీలో పనిచేస్తున్న వందలాంది మంది కార్మికుల్లో 150 మంది నాటి నుండీ విజయ డెయిరీని తెరిపించాలంటూ విఆర్‌ఎస్‌ తీసుకోకుండా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి అండగా పాడి రైతుల సంఘాలు నిలబడితే డెయిరీ కోసం పెనుమూరుకు చెందిన రైతు వెంకటాచలం నాయుడు ఒంటిపై ఉన్న చొక్కా.. కాళ్ళకున్న చెప్పులు వదిలి నాటి నుండీ నేటి సుదీర్ఘకాలం పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేస్తే డెయిరీ ఆస్తులను అమూల్‌కు అప్పగించిన ప్రభుత్వం డెయిరీలో భాగస్వాములుగా ఉన్న పాడిరైతులు అభిప్రాయం తీసుకోకపోవడం పట్ల పాడిరైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

                                                             కార్మికుల జీతాల పరిస్థితి ఏమిటి...

అమూల్‌కు అప్పగించారు.. సరే ఏనాటికైనా విజయ డెయిరీని తెరుస్తారని విఆర్‌ఎస్‌ తీసుకోకుండా పోరాడిన 150 మంది కార్మికుల్లో కొందరు కాలంచేస్తే ప్రస్తుతం వంద మందికి పైగా కార్మికులు ఏనాటికైనా చట్టపరం తమకు అందాల్సిన వేతన బకాయిలు అందుతాయని ఎదురు చూస్తున్నారు. విజయ డెయిరీ ఎదుట చిన్నపాటి అలికిడైనా అక్కడికి చేరుకొని జీతాల బకాయిలపై అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. టిటిడి తీసుకుంటుంది... ప్రభుత్వమే పున్ణప్రారంభిస్తుదంటూ అమూల్‌కు అప్పగించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శరవేగంగా అప్పగింత పనులు..
        అమూల్‌కు విజయ డెయిరీ ఆస్తులను అప్పగించేందుకు 28ఎకరాల విజయ డెయిరీ ఆవరణంలో ఏపుగా పెరిగిన మొక్కలను శుభ్రంచేసే పనిలో కోఆపరేటివ్‌ అధికారులు నిమగమయ్యారు. ఈ పనులను కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, వ్యవసాయశాఖ అధికారులు, కోఆపరేటివ్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విజయ డెయిరీ ఆస్తులను అమూల్‌కు అప్పగించేందుకు శరవేగంగా పనులు చేస్తున్న అధికారులు కార్మికుల జీతాల బకాయిల విజయం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెండింగ్‌ జీతాలు ఎవ్వరు చెల్లిస్తారనే విషయం అటు అధికారులు, ఇటు ప్రభుత్వం తెచ్చకపోవడంతో 21 సంవత్సరాలుగా జీతాల బకాయిల కోసం ఎదురు చూస్తున్న కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అమూల్‌కు ఎన్ని సంవత్సరాలు లీజుకు ఇచ్చారు, సహకార విజయ డెయిరీలో భాగస్వాములగా ఉన్న పాడి రైతుల పరిస్థితి ఏమిటి, కార్మికుల జీతం బకాయిల పరిస్థితెమిటి అనే విషయాలను తెచ్చాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి ఏమి చెప్పలేమంటూ కోఆపరేటివ్‌ జిల్లా అధికారి వనజ సమాధానం ఇస్తున్నారు.