తెలంగాణ, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వివిధ రకాల వినతి పత్రాలు పట్టుకున్న గ్రామీణులు గుంపులుగా వేచి ఉన్నారు. ఆ గుంపులో ఓ యువకుడు చేతిలో రెండు పత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి రాష్ట్ర యూనివర్శిటీ నుండి, మరొకటి ఐఐటి నుండి ఆఫర్ లెటర్. మద్రాస్ ఐఐటిలో చేరేందుకు రూ.20 వేల ఆర్థిక సాయం కోరేందుకు ఆ యువకుడు అక్కడ వేచివున్నాడు. అలా కలెక్టరు, కొంతమంది దాతలు చేసిన ఆర్థికసాయంతో కాలేజీలో సీటు సంపాదించాడు. అతని పేరు డోంగ్రే రేవయ్య. 2022 యుపిఎస్‌సి పరీక్షల్లో 410వ ర్యాంకు సాధించిన అతను స్ఫూర్తివంత ప్రయాణం గురించి మరికొంత తెలుసుకుందాం.
తెలంగాణ తుంగ్డ గ్రామంలో పుట్టిన రేవయ్యకు నాలుగేళ్లప్పుడు అతని తండ్రి చనిపోయాడు. ముగ్గురు బిడ్డలున్న ఆ కుటుంబానికి తల్లే పెద్ద దిక్కైంది. బిడ్డల పోషణ కోసం మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేసింది. రూ.1500 జీతంతో కుటుంబానికి సాకుతున్న ఆ తల్లికి కొడుకు రేవయ్యకు ఐఐటిలో సీటు కోసం తన జీతానికి 14 రెట్లు ఖర్చు చేయాల్సిరావడం కలలో కూడా ఊహించి ఉండదు. అందుకే రేవయ్య దాతల కోసం అర్థించారు.
ప్రభుత్వ బడిలో చదువుకున్న రేవయ్య చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండేవారు. 2017లో మద్రాసు ఐఐటిలో కెమికల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు. 'గేట్' పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ఓఎన్‌జిసిలో ఉద్యోగం సంపాదించారు. కుటుంబానికి సాయంగా ఉద్యోగం చేస్తున్నా ఐఎఎస్ కావాలన్న అతని కల అలాగే ఉండిపోయింది. కల సాకారం కోసం చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2020 నుండి యుపిఎస్‌సి పరీక్షలకు సిద్ధమయ్యారు.
2021లో లక్ష్యం చివరి వరకు వెళ్లి వెనుదిరిగినా నిరాశపడకుండా మళ్లీ ప్రయత్నం చేశారు. ఈసారి మంచి ర్యాంకుతో సివిల్స్ సాధించారు. ర్యాంకు సాధించిన రేవయ్య 'అమ్మ చదువుకోలేదు. స్కూలు గుమ్మం ఎక్కలేదు. మమ్మల్ని సాకేందుకు ఎన్నో కష్టాలు పడింది. ఇన్ని కష్టాలు పడుతున్నా నేను ఐఎఎస్ కావాలని కోరుకునేది. ఇప్పుడు ర్యాంకు రావడంతో నా కలతో పాటు అమ్మ కల కూడా నెరవేరిందని చాలా సంతోషపడుతున్నాను' అంటున్నారు. 'నేను ఐఐటీ జెఇఇలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ డబ్బు లేకపోవడంతో అక్కడ చదవగలననే ఆశను కోల్పోయాను. కానీ అప్పటి కలెక్టర్ డాక్టర్ అశోక్‌కుమార్ నాకు చాలా సాయం చేశారు. ఆ రోజే నేను ఒక నిశ్చయానికి వచ్చాను. నేను కూడా ఆ స్థానంలో ఉంటే నాలాంటి పేద విద్యార్థులకు సాయం చేయగలను అనుకొని పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాను' అంటున్నారు. రేవయ్య. ఆయన మాటలు వింటుంటే మారుమూల గ్రామాల్లో విద్యార్థుల భవిష్యత్తుకు ఏ చిన్న సాయమందించినా వారు అపురూప విజయాలు సాధిస్తారని అర్థమవుతోంది.










