Jan 06,2023 09:52
  • బడ్జెట్‌పై పాఠశాల విద్యా శాఖ కసరత్తు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమ్మఒడి, విద్యా కానుక పథకాలపైనే ప్రధానంగా దృష్టి సారించి ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు జరిగేలా పాఠశాల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. మార్చిలో జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగంలో పాఠశాల విద్యకు సంబంధించి దృష్టిసారించాల్సిన అంశాలకు తుదిరూపునిస్తోంది. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి గణాంకాలను పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022-23లో 71,74,520 మంది పాఠశాల విద్యార్థులున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో మొత్తం 58,952 పాఠశాలలు ఉండగా, వీటిలో 44,703 ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ఎయిడెడ్‌ పాఠశాలలు 910, ప్రైవేట్‌ పాఠశాలలు 13,339 ఉన్నాయి.
            జగనన్న అమ్మఓడి ద్వారా రూ.15 వేలు చొప్పున 2019-20లో 42,33,098 మంది తల్లులకు రూ.6349.6 కోట్లు, 2020-21లో 44,48,865 మంది తల్లులకు రూ.6,673.4 కోట్లు, 2021-22లో 42,62,419 మంది తల్లులకు రూ.6393.6 కోట్లు చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 'నాడు-నేడు' మొదటి దశలో 15,715 పాఠశాలలకు రూ.3,669 కోట్లు ఖర్చు చేయగా, రెండో దశలో 22,344 పాఠశాల లకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జగనన్న విద్యా కానుక ద్వారా మూడు జతల యూనిఫాం, జత బూట్లు, రెండు జతల సాక్సులు, టెక్స్ట్‌, నోట్‌ పుస్తకాలు, స్కూల్‌ బెల్ట్‌, మూడు మాస్కులను ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 2020-21లో 42,34,322 మంది విద్యార్థ్ధులకు రూ.648.10 కోట్లు, 2021-22లో 47,32,064 మంది విద్యార్ధుల కోసం రూ.789.21 కోట్లు, 2022-23లో 45,14,687 మందికి రూ.886.69 కోట్లు నిధులు వెచ్చించారు. జగనన్న అమ్మఒడి కింద ఇస్తున్న రూ.15 వేలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఒక్కొ విద్యార్థి నుంచి రూ.వెయ్యి చొప్పున రెండేళ్లల్లో రూ.871.13 కోట్లు ప్రభుత్వం తిరిగి వసూలు చేసింది. 2022-23లో పాఠశాలల నిర్వహణ నిధి పేరుతో అమ్మఒడి నుంచి మరో రూ.వెయ్యి అదనంగా వసూలు చేయడంతో రూ.349.76 కోట్లు వసూలు చేసింది. గతేడాది ఆగస్టులో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు 4,07,329 మంది దరఖాస్తు చేసుకోగా 2,01,702 మంది అర్హత సాధించారు. పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన ఆరు రకాల పాఠశాలలను కూడా ఈ దఫా బడ్జెట్‌ ప్రసంగంలో కీలకంగా ప్రస్తావించనున్నట్లు తెలిసింది. పాఠశాలల విలీనం ద్వారా 4,421 మంది ఎస్జిటిలకు, 998 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లకు పదోన్నతి కల్పించారు. ఈ వివరాలన్నీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొనే వీలుంది.