Aug 03,2023 21:02

ఫిచ్‌ రేటింగ్‌ కోత ఎఫెక్ట్‌
సెన్సెక్స్‌ మరో 500 పాయింట్లు ఫట్‌
రెండు రోజుల్లో రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి : అంతర్జాతీయ రేటింగ్‌ ఎజెన్సీ ఫిచ్‌ అమెరికా పరపతికి కోత పెట్టడంతో రెండో రోజూ ప్రపంచ మార్కెటు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. గురువారం సెషన్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 542 పాయింట్లు లేదా 0.82 శాతం పతనమై 65,241కు పడిపోయింది. అదే బాటలో ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 145 పాయింట్లు లేదా 0.74 శాతం కోల్పోయి 19,382 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 64,963, నిఫ్టీ 19,296 కనిష్ట స్థాయిలను తాకాయి. వరుసగా రెండు రోజుల ఒత్తిడితో సెన్సెక్స్‌ 1200 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైంది.
అమెరికా రుణ పరపతి రేటింగ్‌ను ఫిచ్‌ 'ఎఎఎ' నుంచి ఎఎఫ్లస్‌కు తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. అమెరికా మార్కెట్లు అయినా డోజోన్స్‌, నాస్‌ డాక్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఎఎస్‌ఎక్స్‌, షాంఘై కాంపోజిట్‌, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌, జపాన్‌ నిక్కీ కూడా నష్టపోయాయి. దీనికి తోడు అమెరికా బాండ్‌ రాబడులు పెరగడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి పరిణామాలు ప్రతికూల సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ భారత్‌ మార్కెట్ల రేటింగ్‌ను ఓవర్‌ వెయిట్‌గా మార్చి.. చైనా రేటింగ్‌ను ఈక్వల్‌ వెయిట్‌కు కుదించింది. అయినా ఇవేవీ మదుపరుల్లో విశ్వాసాన్ని నింపలేకపోయాయి.
నిఫ్టీ-50లో 30 స్టాక్స్‌ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. వాటిలో టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఒఎన్‌జిసి, ఐసిఐసిఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, అల్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌, యుపిఎల్‌, బజాజ్‌ ఫినాన్స్‌ అధికంగా నష్టాలు చవి చూసిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బిఎస్‌ఇలో మిడ్‌ క్యాప్‌ 0.14 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.23 శాతం చొప్పున తగ్గాయి. నిఫ్టీలో ఫార్మా, మీడియా సూచీలు ఒకశాతం చొప్పున రాణించగా.. మిగితా రంగాలన్నీ నష్టపోయాయి.