Sep 26,2023 10:38

హవానా : ఆదివారం సాయంత్రం అమెరికాలోని క్యూబన్‌ దౌత్య కార్యాలయంపై పెట్రోల్‌ బాంబులతో దాడి జరిగింది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే గ్రూపుల పట్ల కఠిన చర్యలు తీసుకోవడంలో అమెరికా అధికారులు విఫలమయ్యారని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని మంత్రి చెప్పారు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి వుందన్నారు. తమకు అమెరికా ప్రభుత్వం నుండి రక్షణ అందుతుందని భావించినప్పుడు క్యూబా వ్యతిరేక గ్రూపులు ఇటువంటి తీవ్రవాదానికి పాల్పడతాయని, దీని గురించే క్యూబా ఎప్పుడూ హెచ్చరిస్తూ వుంటుందని ఆయన పేర్కొన్నారు. క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌తో సహా ప్రపంచ నేతలందరూ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సమయంలోనే ఈ దాడి చోటు చేసుకోవడం గమనార్హం. 2020 ఏప్రిల్‌లో కూడా ఇలాగే క్యూబా దౌత్య కార్యాలయంపై దాడి జరిగిన విషయాన్ని రొడ్రిగజ్‌ గుర్తు చేసుకున్నారు. అమెరికా అనుసరించే క్యూబా వ్యతిరేక విధానాల కారణంగానే ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. క్యూబాలోని సోషలిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అమెరికా తమ దేశంపై, ప్రభుత్వంపై అనేక ఆంక్షలు పెడుతోందన్నారు. తమ దేశంపై సాగే ప్రచారానికి అమెరికా ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. అమెరికా అనుసరించే వైఖరే వారిని ఇటువంటి దాడులకు తెగబడేలా చేస్తోందన్నారు.