Sep 14,2023 09:27
  • ఘటనపై దర్యాప్తునకు భారత్ డిమాండ్
  • ఉన్నతాధికారిపై సియాటిల్‌ పోలీసు అధికారుల విచారణ

అమెరికాలో ఆంధ్రా యువతి మృతి పోలీసులు అవహేళన చేసిన ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని భారత్‌ తాజాగా అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. యువతి మరణాన్ని చులకన చేస్తూ పోలీసులు చేసిన వ్యాఖ్యల తాలూకు ఆడియో రికార్డింగ్‌ వైరల్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆదోని పట్టణం హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన జాహ్నవి ఎంఎస్‌ చేసేందుకు సియాటిల్‌లోని నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీలో 2021 సెప్టెంబరు 20వ తేదీన చేరారు. 2023 జనవరి 23న సియాటిల్‌లోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే మృతిచెందింది. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న దృశ్యాల్లో పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ ఈ కేసు దర్యాప్తు గురించి మాట్లాడడం వినిపించింది. 'ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు' అన్నట్లుగా మాట్లాడారు. ఆ సమయంలో పగలబడి నవ్వారు. ఈ వీడియోపై సియాటిల్‌ కమ్యూనిటీ పోలీసు కమిషన్‌ తీవ్రంగా పరిగణించడంతో పాటు డేనియల్‌, అతని సహౌద్యోగి మధ్య జరిగిన సంభాషణ దిగ్భ్రాంతి కలిగించిందని.. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది.