Mar 13,2023 21:03
  • సెన్సెక్స్‌ 1400 పాయింట్ల క్షీణత

ముంబయి : అమెరికన్‌ బ్యాంక్‌ల వరుస విఫలం ప్రపంచ మార్కెట్లను కుదేలు చేస్తున్నాయి. అందులోనూ బ్యాంకింగ్‌ స్టాక్స్‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా మూడో రోజూ నష్టాల పాలయ్యాయి. సోమవారం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడితో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 897 పాయింట్లు పతనమై 58,238కి పడిపోయింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఏకంగా 1,415 పాయింట్లు పతనమయ్యింది. ఒక్క పూటలోనే మదుపర్ల సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 259 పాయింట్లు కోల్పోయి 17,154 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్‌ సూచీ 850 పాయింట్ల మేర కోల్పోయింది. ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7 శాతం నష్టపోయింది. ఎస్‌బిఐ 3 శాతం విలువ కోల్పోయింది. టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. సోమవారం అమెరికన్‌ బ్యాంక్‌లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం మంగళవారం భారత్‌ సహా ఇతర దేశాల మార్కెట్లపై ప్రతికూలతను పెంచే అవకాశాలున్నాయి.