May 17,2023 12:36

వాషింగ్టన్‌ : అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ రుణ పరిమితిని పెంచకపోతే జూన్‌ 1 వరకే చెల్లింపులు జరపగలుగుతామని అమెరికా ఆర్థిక శాఖ సోమవారం తెలియచేసింది. ఆ పైన ప్రభుత్వ ఖర్చులేవైనా భరించే పరిస్థితి లేదని తెలిపింది. ఈ విషయమై ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌ రెండు వారాల్లో కాంగ్రెస్‌కు రెండు లేఖలు రాశారు. దీంతో అమెరికా రుణాల చెల్లింపుల సంక్షోభం మరింతగా ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలి ఫెడరల్‌ పన్ను చెల్లింపులను సమీక్షించిన తర్వాత తమకున్న అత్యుత్తమ అంచనాల ప్రకారం జూన్‌ 1వరకు ప్రభుత్వ వ్యయాలను భరించగలుగుతామని ఆమె ఆ లేఖలో తెలిపారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లపై ఒత్తిడి పెరుగుతోంది. రాబోయే రోజుల్లో వైట్‌హౌస్‌ తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒప్పందం కుదరని పక్షంలో అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా చెల్లింపుల సంక్షోభం తలెత్తవచ్చని ఆందోళన చెందుతున్నారు. బుధవారం నుండి అధ్యక్షుడు జో బైడెన్‌ విదేశీ పర్యటన జరపనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఆర్థిక శాఖ అసాధారణ చర్యలు తీసుకునే వాస్తవ తేదీ ఈ అంచనాల తర్వాత కొన్ని రోజులు లేదా వారాలు వుండవచ్చు. మే 1వ తేదీన యెలెన్‌ మొదటిసారిగా లేఖ రాశారు.