Sep 09,2023 08:23
  •  రష్యా రాజకీయ నిపుణుడి వ్యాఖ్య

మాస్కో : అమెరికా సైనిక గుత్తాధిపత్యం అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఒక ముప్పుగా పరిణమించిందని రష్యన్‌ రాజకీయ నిపుణుడు దిమిత్రి సుస్లోవ్‌ వ్యాఖ్యానించారు. తన విస్తరణ విధానాలతో, అక్రమ సైనిక జోక్యాలతో, ఇతర దేశాల భద్రత, సుస్థిరతలను దెబ్బతీయడం ద్వారా అమెరికా సుదీర్ఘకాలంగా తన సైనిక గుత్తాధిపత్యాన్ని పెంచి పోషించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. మాస్కోలోని నేషనల్‌ రీసెర్చ్‌ యూనివర్శిటీ హయ్యర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అంతర్జాతీయ అధ్యయనాల కేంద్ర డిప్యూటీ డైరెక్టర్‌గా దిమిత్రి వున్నారు.అమెరికా సైనిక గుత్తాధిపత్యానికి సంబంధించిన మూలాలు, వాస్తవాలు, ప్రమాదాలు అన్న శీర్షికతో జిన్హువా ఇనిస్టిట్యూట్‌ ఒక నివేదికను మంగళవారం విడుదల చేసింది. ఆ నివేదిక విడుదల కార్యక్రమంలో దిమిత్రి సుస్లోవ్‌ కూడా పాల్గొన్నారు. ''అమెరికా సైనిక గుత్తాధిపత్యం ప్రపంచానికి శాంతి సుస్థిరతలను తీసుకురాదు. పైగా దీనికి విరుద్ధంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, అక్రమంగా సైనిక ఉల్లంఘనలకు పాల్పడుతుంది'' అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. 1999లో యుగోస్లోవియాపై నాటో బాంబు దాడులు, 2003లో ఇరాక్‌పై దండయాత్ర, 2011లో లిబియాపై నాటో దాడి వంటి సంఘటనలతో అనేక విషాదకరమైన పర్యవసానాలు సంభవించాయని అన్నారు. ఇతర దేశాలతో ఘర్షణేతర సమాన స్థాయి సంబంధాలు అన్న అంశాన్ని అమెరికా కనీసం ఊహించను కూడా ఊహించలేదని ఆయన విమర్శించారు.