- మోసపూరిత చర్యగా పర్యావరణవేత్తల ఆగ్రహం
వాషింగ్టన్ : అణు ధార్మిక వ్యర్థ జలాలను పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేస్తున్న జపాన్ చర్యను అమెరికా సమర్థించింది. ఈ చర్యకు దేశ విదేశాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అమెరికా మాత్రం జపాన్ వాదనను సమర్థించింది. అణు వ్యర్థాల శుద్ధి చేయడంలో జపాన్ తీసుకున్న భద్రతా చర్యల పట్ల తాము సంతృప్తి చెందామని ప్రకటించింది. అణు ధార్మిక పదార్థాలతో కలుషితమైన నీటిని విడిచిపెట్టే విషయంలో జపాన్ సురక్షితంగా, పారదర్శకంగా వ్యవహరిస్తోందని, పైగా ఇదంతా శాస్త్రీయ దృక్పథంలో కూడిన ప్రక్రియ అని అమెరికా విదేశాంగ శాఖ వత్తాసు పలకడం పట్ల పర్యావరణవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షకురాలిగా గొప్పలు చెప్పుకునే అమెరికా.. అణు వ్యర్థాల విషయంలో జపాన్‌ను సమర్థించి మోసపూరితంగా వ్యవహరిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. జపాన్‌ను సమర్థించడం ద్వారా తన స్వార్థ బుద్ధిని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రజల దీర్ఘకాలిక సంక్షేమానికన్నా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చే నయవంచనను అమెరికా బయటపెట్టుకుందని విమర్శించారు. పసిఫిక్ సముద్రంలోకి కలుషితమైన అణు వ్యర్థ జలాలను పారబోయాలన్న జపాన్ ప్రభుత్వ ఆలోచనకు అమెరికా బహిరంగంగా మద్దతునిస్తూ..మరోవైపు జపాన్ నుంచి వ్యవసాయ, మత్స్యపరిశ్రమ ఉత్పత్తుల దిగుమతులను ఈ ఏడాది ప్రారంభం నుంచీ బాగా తగ్గించుకుందని, దాని ద్వంద్వ నీతికి ఇదే నిదర్శనమని పలువురు శాస్త్రవేత్తలు జపాన్ వ్యవసాయ, అటవీ, మత్స్య విభాగాల డేటాను సైతం ఉటంకిస్తూ విమర్శలు గుప్పించారు. ఇదిలా వుండగా, జపాన్ చర్యకు మద్దతుగా ఆగస్టు 31వ తేదీన ఫుకుషిమా ప్రాంతంలో పర్యటించి అక్కడి చేపలను తింటానని జపాన్‌లో అమెరికా రాయబారి రాV్‌ా్మ ఎమ్మాన్యుయెల్ చెప్పారు. దీనిపై రాజకీయ నిపుణుడు లూ చావో గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ, జపాన్ స్వార్థపూరితమైన చర్యను, బాధ్యతారహితమైన వైఖరిని కప్పిపుచ్చడానికి అమెరికా నయవంచన ప్రదర్శిస్తూ, ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని విమర్శించారు.










