Aug 07,2023 10:18

బీజింగ్‌ : పెరుగుతున్న సైనికీకరణతో ప్రాంతీయ, ప్రపంచ శాంతికి జపాన్‌ ముప్పుగా పరిణమిస్తుందని చైనా వ్యాఖ్యానించింది. రక్షణ వ్యయంపై జపాన్‌ తాజాగా విడుదలజేసిన శ్వేతపత్రంపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం స్పందించింది. జపాన్‌ తన సైనిక వ్యయాన్ని ఇదివరకెన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో పెంచిందని, దీనిని సమర్థించుకోవడానికి తమను బూచిగా చూపిస్తోందని చైనా రక్షణ శాఖ ప్రతినిధి విమర్శించారు. జపాన్‌ సైనిక విస్తరణవాదం ప్రాంతీయ, ప్రపంచ శాంతి , సుస్థిరతలకు చేటు అని ఆయన అన్నారు. కిషిదా కేబినెట్‌ ఆమోదించిన ఈ శ్వేత పత్రం-2023 జపాన్‌ సైనికీకరణవైపు దూకుడుగా వెళ్తున్న విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. జపాన్‌ యుద్ధానంతర రక్షణ విధానం నుంచి సైనికీకరణ వైపు మళ్లుతోందని ఆయన తెలిపారు. సముద్ర సమస్యలను పరిష్కరించుకునేందుకు స్థిరమైన, నిర్దిష్టమైన నిబంధనలున్నాయి. దీనికి విరుద్ధంగా కొన్ని దేశాలు తమ సైనిక పరాక్రమాన్ని చాటుకోడానికి దక్షిణ చైనా సముద్ర జలాల్లోను, తైవాన్‌ జల సంధి మార్గంలోకి తమ యుద్ధ నౌకలను, విమానాలను పంపి ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. గత ఏడాది డిసెంబరులో జపాన్‌ ప్రభుత్వం వివాదాస్పద జాతీయ భద్రతా వ్యూహాన్ని ప్రకటించిన తరువాత వెలువడిన మొదటి శ్వేతపత్రం ఇది.